Cat Srimantham ceremony: ఈ మధ్యకాలం ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులను కూడా తమ పిల్లలతో సమానంగా చూసుకుంటున్నారు యజమానులు. వాటి ఆహారం, సేఫ్టీ కోసం లక్షల్లో ఖర్చు చేసేవారు కూడా ఉన్నారు. పిల్లల మాదిరిగానే కుక్కలు కూడా బర్త్ డేలు, స్పెషల్ డేస్ జరిపిస్తున్నారు.
అయితే ఇప్పటివరకు పెంపుడు జంతువులకు బర్త్ డేలు చేయడం చూసుంటాము.. కానీ శ్రీమంతం కూడా చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా..? ఏంటి పిల్లికి శ్రీమంతమా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును ఇది నిజమేనండి బాబు. ఖమ్మంలోని ఓ కుటుంబం తమ పెంపుడు జంతువు పిల్లికి శ్రీమంతం వేడుక చేసి దానిపై ప్రేమను చాటుకున్నారు.
పిల్లికి శ్రీమంతం వేడుక..
ఖమ్మం జిల్లాలోని మధిర సిపిఎస్ రోడ్ లో నివాసం ఉంటున్న అల్లూరి నాగభూషణం, పద్మావతి దంపతులు ఒక పిల్లిని పెంచుకుంటున్నారు. దాని పేరు సాషా. అయితే సాషా ఇప్పుడు కడుపుతో ఉంది. దీంతో నాగభూషణం, పద్మావతి దంపతులు తమ పిల్లి పై ప్రేమతో దానికి శ్రీమంతం వేడుకను నిర్వహించారు. పిల్లికి అన్ని రకాల నగలు, ఆభరణాలు ధరింపజేసి అందంగా ముస్తాబు చేశారు. దానికి సంప్రదాయాల ప్రకారం మంగళహారతులు కూడా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన కొందరు జంతు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.