![Vikarabad Psycho: 'చీర కొంగుతో మెడకు..' ఏడుగురు మహిళలను చంపి మూటగట్టి పడేసిన సైకో](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/psycho-1-jpg.webp)
Vikarabad Psycho Arrest : ఒంటరి మహిళలే అతని టార్గెట్.. మాయ మాటలు చెప్పి.. కూలి పని ఇప్పిస్తానని పేదవాలని నమ్మించి చంపడం అతని నైజం. అత్యంత ఘోరంగా చంపేసి మూట గట్టి పడేస్తాడు. ఏం తెలియని వాడిలా ఊర్లోనే తిరుగుతాడు. ఇలా ఒకరిని కాదు ఇద్దరిని కాదు.. ఏకంగా ఏడుగురిని చంపాడు. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో వరుస హత్యలకు పాల్పడుతున్న కిష్టప్ప అనే సైకో కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చీర కొంగుతో మెడకు చుట్టి హత్య చేసిన ఘనుడి క్రూరత్వం బయటపడింది. ఏడుగురిని హత్య చేసిన సైకో కిల్లర్ పోలీసులకు దొరికిపోయాడు.
ఇటీవల వికారాబాద్ జిల్లాలో జరుగుతోన్న మహిళల వరుస హత్యలను పోలీసులు చేధించారు. కాగా, రెండు రోజుల క్రితం అడ్డా మీద ఉన్న ఓ మహిళను పని కల్పిస్తానని చెప్పి తీసుకెళ్లి సైకో కిష్టప్ప హత్య చేశాడు. మహిళ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also read: అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం.!
సీసీ ఫుటేజీ పరిశీలించగా.. చివరగా కిష్టప్ప మహిళతో మాట్లాడి ఆమెను తీసుకువెళ్లినట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. దీంతో కిష్టప్పను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డట్లు పోలీసులు వెల్లడించారు. మహిళను చంపి మూట గట్టి పడేసిన సైకో కిష్టప్ప విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉపాధి పేరుతో ఇప్పటివరకు ఏడుగురు మహిళలను హత్య చేసినట్లు సైకో కిష్టప్ప అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం సైకో కిష్టప్ప తాండూర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.