అది 2005 సెప్టెంబర్.. భారీ వర్షాలకు విజయవాడ నడిబొడ్డున ప్రవహించే బుడమేరు వాగు పొంగి పొర్లింది. నగరంలో మూడు వంతులు నీట మునిగిన రోజులవి.. నాటి వరద విలయానికి ఏకంగా కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు.. సీన్ కట్ చేస్తే 2024.. నగరం మళ్ళి మునిగింది.. ప్రజలు ఇళ్ల పైకప్పులపై ఎక్కి ప్రాణాలు దక్కించుకుంటున్న పరిస్థితి.. విజయవాడ మొత్తం చెరువులా మారిపోయింది..! 19ఏళ్ల తర్వాత మళ్ళి అదే సీన్ రిపీట్ అయ్యింది. మరి ఈ 19ఏళ్లు పాలకులు ఏం చేసినట్టు? ప్రస్తుత విజయవాడ పరిస్థితికి రాజకీయ పార్టీలే కారణామా?
కృష్ణా జిల్లా చుట్టుపక్కల ఉన్న కొండలలో ఉద్భవించిన నది బుడమేరు. దీన్ని సారో ఆఫ్ విజయవాడ అని కూడా పిలుస్తారు. మైలవరం చుట్టుపక్కల ఉన్న కొండలలో ఉద్భవించిన బుడమేరు ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ప్రతి వర్షాకాలంలో విజయవాడ ప్రాంతాన్ని ముంచెత్తుతోంది. వరదలను నియంత్రించేందుకు వెలగలేరు గ్రామం వద్ద నదికి ఆనకట్ట కట్టారు. వెలగలేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణా నదిలో కలిపేలా మళ్లింపు ఛానల్, BDCని నిర్మించారు. అయితే ఈ మళ్లింపు సక్రమంగా జరగడం లేదు.. అందుకు ప్రధాన కారణం.. నదీ ఆక్రమణతో పాటు రాజకీయ నాయకుల అండదండలతో వెలిసిన అడ్డగోళ్ల నిర్మాణాలు.
2004లో బుడమేరు ఉప్పొంగి ప్రవహించింనప్పుడు దాని ఒడ్డున ఉన్న ఇళ్లకు ముప్పు వాటిల్లింది. బుడమేరుపై ఉన్న రైల్వే బ్రిడ్జి గతంలో రెండుసార్లు కొట్టుకుపోయింది. ప్రస్తుతం వరదలు కూడా అలాగే ఆందోళనకరంగా ఉన్నాయి. ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చే వరదలే నగరంలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. దాదాపు 2,76,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వీరిలో ఎక్కువగా పేదవారే ఉన్నారు. బుడమేరు కొల్లేరు మీదుగా వెళ్లడం, దాని గట్లు ఆక్రమణలకు గురికావడం ఈ ముంపునకు ప్రధాన కారణం.
ఇక సాధారణ సీజన్‌లో బుడమేరు గరిష్టంగా 11వేల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది ఏకంగా 70వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో వరదలతో నగరం అల్లకల్లోలమైంది. నాడు లెఫ్ట్ పార్టీలు ఈ విషయంపై నిరసనలకు దిగాయి. సీపీఐ అనుబంధ రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్వయంగా విజయవాడ వచ్చారు. భవిష్యత్‌లో బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు.
బుడమేరు వరద ముప్పు సమస్య పోవాలంటే దాని నీరు మళ్లింపు ఒక్కటే మార్గమని ఇరిగేషన్ శాఖ అధికారులు నాడు వైఎస్‌కు వివరించారు. దీంతో ఆపరేషన్ కొల్లేరు ప్రారంభమైంది. బుడమేరు మలుపులు సరి చేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూడాలన్నది వైఎస్ ప్లాన్. అక్కడ నుంచి కృష్ణానదిలోకి వరద నీరు చేరాలి. అయితే కృష్ణానది ముఖ ద్వారంలో అనేక నిర్మాణాలు ఉన్నాయి. అవి వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయి. అక్కడి నిర్మాణాలను టచ్ చేసే వారు లేకుండా పోయారు. ఈ నిర్మాణాలు చాలా వరకు రాజకీయ నాయకులవేనన్న విమర్శలు ఉన్నాయి.
అటు 2009 తర్వాత బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా నిలిచిపోయాయనే చెప్పాలి. అప్పటి నుంచి రాజకీయ నాయకులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఏళ్ల తరబడి రాజకీయ నాయకుల అండతో ఆక్రమణలు జరిగాయి. ఈ ఆక్రమణల వల్ల వరద ముంపు పెరగడమే కాకుండా సహజసిద్ధమైన వరద నీటి పారుదలకి కూడా ఆటంకం ఏర్పడి విజయవాడలో మరోసారి ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది.