Chandrababu Arrest Updates: చంద్రబాబుకు సీఐడీ కస్టడీకి అప్పగించడంపై ఏసీబీ కోర్టు(ACB Court) ఇవాళ తీర్పు వెల్లడించనుంది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు చంద్రబాబు(Chandrababu) కస్టడీ పిటిషన్‌పై తీర్పును వెలువరించనున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. అయితే, ఈ కేసులో పెద్ద కుట్ర దాగుందని, దానిని వెలికి తీయాలంటే.. చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాల్సిందేనని సీఐడీ తరఫున న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. ఇకపోతే.. ఇప్పటికే విచారణ ముగిసి రిమాండ్ ఖైదీగా ఉన్నారని, ఇక కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేశారు. అయితే, ఇవాళ తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. చంద్రబాబు నాయుడు ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. నేడు వర్చువల్ విధానంలో చంద్రబాబుని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఈ నెల 9న చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు.. టిడిపి అధినేత చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. అంటే ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించారు. నేటితో కస్టడీ ముగియనుండగా.. కోర్టు ఆదేశాల మేరకు ఏ సమయంలో అయినా చంద్రబాబును ఎసిబి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. కాగా, నేటితో చంద్రబాబు రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసిబి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు కానున్నారు చంద్రబాబు. ఈ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే కోర్టుకు హాజరయ్యేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు కోస్తా జైళ్ల శాఖ డిఐజి.
పిటి వారెంట్లపై విచారణ..
చంద్రబాబుపై సీఐడీ అధికారులు దాఖలు చేసిన పిటి వారెంట్లపై ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగనుంది. రింగ్ రోడ్డు అలైన్‌మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో అక్రమాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబుపై అభియోగాలు మోపారు సీఐడీ అధికారులు. ఈ కేసులో కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటి వారెంట్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నేడు విచారించనుంది.
సీఐడీ అధికారుల కాల్ రికార్డ్స్ సేకరించాలంటూ పిటిషన్..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలో నంద్యాల వెళ్లిన సీఐడీ అధికారుల కాల్డ్ రికార్డ్స్ సేకరించాలంటూ దాఖలైన పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరుగనుంది. 46crpc ప్రకారం వ్యక్తి కదలికలపై నిఘా పెట్టారని ఏసిబి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు చంద్రబాబు తరపు న్యాయవాది. సీఐడీ అధికారులు అరెస్ట్ సమయంలో ఎవరితో మాట్లాడారు, ఎవరికి సమాచారం ఇచ్చారు తెలిపే కాల్ రికార్డ్స్ భద్ర పరచాలని చంద్రబాబు తరపు ఏసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ వేయాలని సీఐడీకి ఇప్పటికే ఏసిబి కోర్టు ఆదేశించింది. సోమవారం కౌంటర్ దాఖలు చేస్తామని ఇప్పటికే ఏసిబి కోర్టులో మెమో దాఖలు చేసింది సిఐడి. ఈ పిటిషన్లపై ఏసీబీ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది.
Also Read:
Telangana: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇంటి స్థలాలు.. మరో పది రోజుల్లో పంపిణీ..
Telangana: పేదల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు: మంత్రి కేటీఆర్