ఓ వైపు ఎన్నికలు సమీపిస్తుంటే.. మరోవైపు వివిధ పార్టీల కీలక నేతల పార్టీ మార్పులపై ప్రచారాలు కూడా జోరందుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి నేతలు చేరుతున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రత్యర్థులను చెక్ పెట్టేందుకు గెలుపు గుర్రాలను, కలిసి వచ్చే నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
దీంతో తాజాగా మరోసారి కాంగ్రెస్ ఎంపీ, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ గూటికి చేరుతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన దీనిపై రియాక్ట్ అయ్యారు. అవన్నీ అవాస్తవాలని కొట్టి పారేశారు. మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తలపై ఉత్తమ్ సీరియస్ అయ్యారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారడం లేదని..కాంగ్రెస్ తోనే తన ప్రయాణం కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు.
అయితే కొన్ని రోజుల క్రితం కూడా ఇదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మార్పుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగింది. ఆయన ఇంకా ఆయన సతీమణి ఇద్దరూ కూడా త్వరలోనే బీఆర్ఎస్ లోకి జంప్ అవుతారని.. టికెట్ కూడా ఇద్దరికి కన్ ఫాం అయిందని ఊహాగానాలు జోరుగా వచ్చాయి. అయితే అప్పుడు కూడా ఆయన మీడియాతో ముందుకు వచ్చి వాటికి చెక్ పెట్టారు. ఈక్రమంలో కావాలని ఉద్దేశపూర్వకంగా పార్టీలోని వారే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ మండిపడుతున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీలో ఓ వైపు నుంచి చేరికలు జోరందుకుంటుంటే మరో వైపు నుంచి కొందరు సీనియర్లు పార్టీకి గుడ్ బై చెబుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా కూడా.. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను మానసికంగా దెబ్బతీయడానికి చేస్తున్నట్టుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్న విషయం తెలిసే పార్టీకి డ్యామేజ్ కాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నేతలే సేఫ్ సైడ్ గేమ్ ఆడుతూ ఇలా ప్రచారం చేస్తున్నారన్న వాదన కూడా ఉంది.