Hair Cutting: ఇప్పుడు పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా మారిపోయింది. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఏ మాత్రం ఒత్తిడిని కూడా వారు భరించడం లేదు. చిన్న కారణానికి కూడా డిప్రెషన్ లోకి పోవడమో.. చెడు మార్గాల్లోకి జారిపోయి మొండిగా ప్రవర్తించడమో ఎక్కువగా జరుగుతోంది. అంతేకాకుండా, కొంతమంది పిల్లలు తమకు ఇష్టం లేని పని తల్లిదండ్రులు చెబితే.. ఆ కోపాన్ని.. బాధను చూపించడానికి మరణాన్ని కొనితెచ్చుకుంటున్నారు. తెలిసీ తెలియని తనంతో తమ జీవితాన్ని బలిచ్చి.. కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. ఇదిగో ఈ స్టోరీ చదవితే మీరు కూడా అయ్యో అని బాధపడకుండా ఉండలేరు.
Hair Cutting: ఇంట్లో పిల్లవాడు వాంతులు చేసుకుంటున్నట్టు కనిపించాడు. తల్లి, తండ్రి పరిగెత్తి వెళ్లి ఏమైందని చూశారు. ఆ పిల్లవాడు పురుగుల మందు తాగినట్టు చెప్పాడు.. దీంతో కంగారు పడిన అమ్మానాన్నా.. ఆసుపత్రికి పిల్లవాడిని తీసుకువెళ్లినా ఫలితం దక్కలేదు. ఇంతకీ అలా ఎందుకు చేశాడంటే.. ఈసం కాంతారావు మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం చింతగూడెం గ్రామంలో నివసిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఐదో తరగతి చదువుతున్న చిన్నకొడుకు హర్షవర్ధన్(09) సీతానగర్ లో హాస్టల్ ఉంటున్నాడు. ఎండాకాలం సెలవుల కోసం ఇటీవల ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈనెల 25న కాంతారావు తన ఇద్దరు పిల్లలకు కటింగ్ చేయించాడు. అయితే, హర్షవర్ధన్ కు ఆ కటింగ్ నచ్చలేదు. కటింగ్ అలా చేయించినందుకు బార్బర్ షాపు వద్దే గొడవ చేశాడు. ఏడుపు మొదలు పెట్టాడు. దీంతో కాంతారావు అలానే బావుంటుంది అంటూ సర్ది చెప్పాడు. అయినా హర్షవర్ధన్ ఊరుకోకుండా ఏడుస్తూనే ఉన్నాడు.
Also Read: తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్.. ఫొటో వైరల్
Hair Cutting: పిల్లాడు బాధలో ఉన్నాడు. కొద్దిసేపటికి వాడే సర్దుకుంటాడు అని అనుకున్నారు హర్షవర్ధన్ తల్లిదండ్రులు . ఈ క్రమంలో ఇంటికి వచ్చిన కొద్దిసేపటి తరువాత వాంతులు చేసుకుంటున్న హర్షవర్ధన్ కనిపించాడు. దీంతో కంగారు పడిన కాంతారావు ఏమైందంటూ కొడుకును అడిగితే.. కటింగ్ నచ్చక పురుగు మందు తాగాను అంటూ హర్షవర్ధన్ బదులిచ్చాడు. దీంతో హతాశులైన కాంతారావు దంపతులు.. హర్షవర్ధన్ ను నర్సంపేట లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న హర్షవర్ధన్ కు వెంటనే చికిత్స చేసినా కోలుకోకపోవడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హర్షవర్ధన్ గురువారం ఉదయం మరణించాడు. దేంతో కాంతారావు దంపతులకు పుత్రశోకమే మిగిలింది. కుటుంబసభ్యులు దుఃఖంలో మునిగిపోయారు.