ప్రపంచంలో యుద్ధాల కంటే కరువులతో పోయిన ప్రాణాలే ఎక్కువ. అతివృష్టి, అనావృష్టి, యుద్ధాలు... కారణం ఏదైనా పుట్టుకొచ్చే రాక్షసి మాత్రం కరువే. అలా కొన్ని కోట్ల ప్రాణాలు తీసింది ఆకలి. అలాంటి కరువుని మనదేశంలో నామరూపాలు లేకుండా చేసిన మనిషి ఎమ్‌ఎస్ స్వామినాథన్. హరిత విప్లవానికి పితామహుడిగా పేరున్న ఆయనని భారతరత్నగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ (Swaminathan) 1925, ఆగస్ట్ 7న మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. తండ్రి సాంబశివన్ సర్జన్. తండ్రి బాటలోనే మెట్రిక్ అయ్యాక మెడికల్ స్కూల్లో చేరారు స్వామినాథన్. కానీ 1943లో వచ్చిన బెంగాల్ కరువుని కళ్లారా చూశారాయన. రెండో ప్రపంచయుద్ధం సమయంలో వచ్చిన ఈ కరువుని బ్రిటీష్ ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంది. ఫలితంగా 38 లక్షలమంది చనిపోయారు. బెంగాల్ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆకలి కేకలే వినిపించేవి. ఆ ఘోరకలిని చూసి చలించిన స్వామినాథన్... వైద్య విద్యని పక్కనబెట్టి వ్యవసాయ పరిశోథనల్లోకి వెళ్లాలని మనసు మార్చుకున్నారు.
త్రివేండ్రంలోని మహారాజా కాలేజీలో జువాలజీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన స్వామినాథన్... తర్వాత మద్రాసు వ్యవసాయ కాలేజీలో అగ్రికల్చరల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో పీజీ చదివాక... యూపీఎస్‌సీ రాసి ఐపీఎస్‌కు అర్హత సాధించారు. కానీ, ఆ అవకాశాన్ని వదులుకుని మరీ యునెస్కో ఫెలోషిప్‌తో నెదర్లాండ్స్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరి... బంగాళాదుంపల జన్యు పరిణామంపై పరిశోధన చేశారు. అక్కడి నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు స్వామినాథన్. కొంతకాలం అక్కడ పనిచేసిన ఆయన... 1954లో ఇండియా తిరిగొచ్చి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో పరిశోధనలు సాగించారు.
1960 ప్రాంతాల్లో ఇండియాలో తీవ్ర కరువు పరిస్థితులు వచ్చాయి. ఆ సమయంలో కేంద్ర వ్యవసాయశాఖకి సలహాదారుగా ఉన్న స్వామినాథన్... మెక్సికో హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్‌ని దేశానికి ఆహ్వానించారు. ప్రభుత్వ పరంగా చాలా ఇబ్బందులు ఎదురైనా... మెక్సికో ప్రయోగశాల నుంచి గోధుమని దిగుమతి చేసుకుని ప్రయోగాత్మకంగా పంజాబ్‌లో పండించారు. దాంతో మంచి దిగుబడి రావడంతో, మనదేశంలో హరిత విప్లవం మొదలైంది.
భూములకి నీటిపారుదల సౌకర్యం కల్పించడం, సాంప్రదాయ వ్యవసాయ పనిముట్లకి బదులు యంత్రాలని తీసుకురావడం, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం హరిత విప్లవంలో తొలిమెట్టు. దాంతో పాటు సంకరజాతి వంగడాలతో తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి సాధించడం ఇందులో ప్రధానంగా జరిగేది. ఈ పద్ధతి ద్వారా తిండిగింజల ఉత్పత్తి విపరీతంగా పెంచడంలో స్వామినాథన్ తీవ్రంగా కృషి చేశారు. బాగా దిగుబడి ఇచ్చే వరి, గోధుమ వంగడాలు కనిపెట్టడంలో కీలకపాత్ర పోషించారాయన. ఫలితంగా భారత్‌లో కరువుని శాశ్వతంగా నిర్మూలించగలిగారు. హరిత విప్లవం వల్లే ఇండియా ఆహారభద్రత సాధించగలిగింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
స్వామినాథన్ సేవలకి గాను 1971లో రామన్‌మెగసెసె అవార్డ్ వరించింది. 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అందుకున్నారు. కేంద్రప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషన్ అవార్డులతో ఆయనని సత్కరించింది. 2007 నుంచి 2013 వరకు నామినెటెడ్ ఎంపీగానూ సేవలందించారు స్వామినాథన్. చాలా సందర్భాలో దేశ రాష్ట్రపతిగానూ ఆయన్ని ఎంపిక చేయాలని పలు పార్టీలు కేంద్రానికి సూచించాయి కానీ... ఎందుకో ఆయన్ని పక్కనబెట్టారు. గత ఏడాది సెప్టెంబర్ 28న ఆయన మరణించారు. ఈ నేపథ్యంలోనే దేశంలో కరువుని రూపుమాపిన మొనగాడిగా ఆయన చేసిన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బారత రత్న అవార్డుని ప్రకటించింది.
Also read: కేంద్ర ప్రభుత్వం దళితులను అవమానించాలనే కంకణం కట్టుకుంది: మాయావతి!