మణిపూర్ లో కేంద్ర మంత్రి ఇంటిపై నిరసన కారులు రాళ్ల దాడి చేశారు. రాజధాని ఇంపాల్ లోని కేంద్ర మంత్రి ఆర్ కే రంజన్ సింగ్ నివాసంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండు నెలల్లో కేంద్ర మంత్రి ఇంటిపై ఆందోళన కారులు దాడి చేయడం ఇది రెండవ సారి కావడం గమనార్హం.
మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న దాడులు, రాష్ట్రంలోని పరిస్థితులపై పార్లమెంట్ లో ప్రస్తావించాలని కోరుతూ కేంద్ర మంత్రి నివాసానికి సమీపంలో మహిళ సంఘాలు ఈ రోజు ర్యాలీ నిర్వహించాయి. అదే సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల బృందం ర్యాలీ చేపట్టింది.
రెండు గ్రూపులు కలిసి కేంద్ర మంత్రి నివాసం వద్దకు చేరుకున్నాయి. అయితే ఆ ప్రాంతంలో ఆందోళన కారులకు ర్యాలీ చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. అందువల్ల ఆందోళనకారులు అక్కడి నుంచి వెంటనే వెళ్లి పోవాలని కోరారు. కానీ ఆందోళనకారులు వెనక్కి తగ్గక పోవడంతో ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.
గత నెల 15న కూడా అల్లరి మూకలు మంత్రి ఇంటిపై దాడి చేశాయి. మంత్రి ఇంటిపైకి పెట్రోల్ బాంబులు విసిరారు. వందల మంది నిరసనకారులు ఒక్క సారిగా రావడంతో బంగ్లా వద్ద వున్న సిబ్బంది వారిని నిలువరించ లేకపోయారు. ఆ దాడి సమయంలో కేంద్రం మంత్రి ఆ ఇంట్లో లేరని భద్రతా సిబ్బంది వెల్లడించారు.