కేంద్రానికి ట్విట్టర్ మాజీ ఓనర్ కి గొడవేంటి..?

New Update
కేంద్రానికి ట్విట్టర్ మాజీ ఓనర్ కి గొడవేంటి..?

మోడీ సర్కార్ తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగించిన పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడి.. చివరకు అనుకున్నది సాధించారు అన్నదాతలు. ఆఖరికి ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయితే.. రైతన్నల ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది. దాని చుట్టూ మరో కొత్త వివాదం కూడా రాజుకుంది. ట్విట్టర్ మాజీ ఓనర్ జాక్ డోర్సే ఈ వివాదానికి కారకుడు కాగా.. ఆయనపై కేంద్రం రుసరుసలాడుతోంది.

Twitter founder Jack Dorsey

ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జాక్ డోర్సే భారత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు, విమర్శలు చేసే జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం నుంచి తమకు చాలా అభ్యర్థనలు వచ్చాయన్నారు. భారత్‌లో ట్విట్టర్‌ ను మూసేస్తామని కూడా కొందరు బెదిరించినట్టు చెప్పారు. ఉద్యోగుల ఇళ్లలో తనిఖీలు చేస్తామన్న హెచ్చరికలు కూడా వచ్చాయన్నారు. కానీ, ఈ బెదిరింపులు ఎవరి నుంచి వచ్చాయన్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

జాక్ డోర్సే చేసిన ఆరోపణలు మోడీ సర్కార్ కు కోపం తెప్పించాయి. అదంతా అబద్దమని ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కొట్టిపారేశారు. ఇది ట్విట్టర్ కు ఉన్న అనుమానాస్పద చరిత్రను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నమేనన్నారు. ఈ వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నామని, ఇండియాలో ఏ ట్విట్టర్ కార్యాలయం పైనా దాడి జరగలేదని, దేనినీ మూసివేయడం గానీ, ట్విట్టర్ ఉద్యోగులను అరెస్టు చేసి జైలుకు పంపడం గానీ జరగలేదని వివరించారు.

భారత సార్వభౌమాధికార చట్టాన్ని అంగీకరించడానికి మీ మనస్సు అంగీకరించడం లేదని జాక్ డోర్సేని ఉద్దేశించి అన్నారు రాజీవ్ చంద్రశేఖర్. ఇండియాలో పని చేసే అన్ని సంస్థలూ ఇక్కడి చట్టాలకు అనుగుణంగా పని చేయవలసిందేనని స్పష్టం చేశారు. జాక్ హయాంలో ట్విట్టర్ పక్షపాత వైఖరితో పని చేసిందని ఆరోపించారు. లోగడ రైతుల ఆందోళనలు ఉవ్వెత్తున సాగినప్పుడు కేంద్రం వ్యవహరించిన తీరును విమర్శిస్తూ వచ్చిన వందలాది ఖాతాలను బ్లాక్ చేయవలసిందిగా 2021 ఫిబ్రవరిలో ప్రభుత్వం ట్విట్టర్ ను కోరింది. మొదట ట్విట్టర్ ఇందుకు విముఖత వ్యక్తం చేసినప్పటికీ ఆ తరువాత ఈ ఆదేశాలను పాటించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు