కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ తన ప్రకటనల కారణంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిగ్గా మారాయి. కాంగ్రెస్‌లో చేరమని ఒక నాయకుడు తనకు సలహా ఇచ్చారని, ఆ పార్టీ సభ్యత్వం కంటే బావిలో దూకేస్తానని బదులిచ్చానని చెప్పారు. 60 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో చేసిన పనుల కంటే గత తొమ్మిదేళ్లలో మోదీ నాయకత్వంలోని బీజేపీ రెట్టింపు పనులు చేసిందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం మహారాష్ట్రలోని భండారాలో జరిగిన సభలో నితిన్ గడ్కరీ బీజేపీలో తన తొలి రోజులను గుర్తుచేసుకున్నారు.బీజేపీతో ఇప్పటివరకు పార్టీ ప్రయాణం గురించి మాట్లాడారు.
దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్ సలహా ఇచ్చారు:
దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్ తనకు ఒకసారి ఇచ్చిన సలహాను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. “మహారాష్ట్ర ఎక్స్ ప్రెస్ లో తాను పూణె రైల్వే స్టేషన్ లో దిగగానే…అదే స్టేషన్ లో శ్రీకాంత్ జిచ్కర్ గా దిగారు. అప్పుడు అతను హోంమంత్రి. నన్ను చూసిన శ్రీకాంత్ జిచ్కర్ నితిన్ మీరు ఇక్కడ ఉన్నారు..ఎక్కడికి వెళ్తున్నారంటూ అడిగారు. తన లగేజిని కిందికి దించమని సిబ్బందికి చెప్పారు. వద్దు నేనే తీసుకుంటానని చెప్పి నా లగేజీ నేనే తీసుకున్నాను. అప్పుడు శ్రీకాంత్ జిచ్కర్ మాట్లాడుతూ..నితిన్ నువ్వు మంచి వ్యక్తివి…నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది. కానీ నువ్ బీజేపీలో ఉండటం కంటే…కాంగ్రెస్ చేరితే రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదగలవు అని సలహా ఇచ్చారు. నేను కాంగ్రెస్ లో చేరడం కంటే బావిలో దూకమంటే దూకుతానని…బీజేపీపై దాని సిద్ధాంతాలపై నాకు గట్టి నమ్మకం ఉందని దాని కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పానని” ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
గతం నుంచి మనం నేర్చుకోవాలి – గడ్కరీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో పనిచేసినప్పుడు సంఘ్ తన చిన్న వయస్సులో తనలో విలువలను పెంపొందించారని గడ్కరీ ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన నాటి నుంచి చాలాసార్లు చీలిపోయిందన్నారు. ‘మన దేశ ప్రజాస్వామ్య చరిత్రను మనం మరచిపోకూడదు. భవిష్యత్తు కోసం మనం గతం నుండి నేర్చుకోవాలి. కాంగ్రెస్ తన 60 ఏళ్ల పాలనలో ‘గరీబీ హఠావో’ నినాదాన్ని ఇచ్చింది, కానీ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనేక విద్యా సంస్థలను తెరిచిందని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీని ప్రశంసించిన గడ్కరీ :
భారత్‌ను ఆర్థికంగా అగ్రరాజ్యంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ విజన్‌ని గడ్కరీ కొనియాడారు. దేశ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉందన్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేయలేని పనిని బీజేపీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో రెట్టింపు చేసిందని గడ్కరీ అన్నారు. 2024 చివరి నాటికి ఉత్తరప్రదేశ్‌లోని రోడ్లు అమెరికా తరహాలో ఉంటాయని ప్రజలకు చెప్పానని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.