Krishna District: రేయింబవళ్లు కష్టపడి..పైసా పైసా కూడబెట్టిన సొమ్మును బ్యాంకుల్లో దాచుకుంటాం. కానీ బ్యాంక్ సిబ్బందే మన సొమ్మును దోచేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పెనమలూరులో బ్యాంక్ మేనేజర్ ఘరానా మోసం వెలుగులోకొచ్చింది. కస్టమర్ బ్యాంకులో ఉంచిన బంగారాన్ని కాజేసి వడ్డాణం చేయించుకుంది గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ దావులూరి ప్రభావతి. రుణం తీర్చేసి బంగారం కోసం వచ్చిన కస్టమర్‌కు ఊహించని సమాధానం చెప్పి షాక్‌కు గురిచేసింది.
Also Read: వైసీపీ అధిష్టానంపై మంత్రి గుమ్మనూరు జయరాం అలక..!
ప్రభావతి స్వగ్రామం నూజివీడు మండలం మర్రిబంధం. ఐతే అదే గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైదరాబాద్‌లో ఉన్న బ్యాంకు ఖాతాను గంగూరు శాఖకు ట్రాన్స్‌ఫర్ చేయించింది. దీంతో యోగేశ్వరరావు తన వద్ద ఉన్న 380 గ్రాముల బంగారం కోసం లాకర్ అడిగాడు. ఐతే లాకర్‌లో పెట్టుకునే కంటే బ్యాంకు రుణం తీసుకోమని సూచించడంతో 2 లక్షలు రుణం తీసుకున్నాడు. గతేడాది నవంబర్‌లో ఆ రుణం మొత్తం తీర్చేసిన యోగేశ్వరరావు..కుదువపెట్టిన ఆభరణాలు ఇవ్వమని అడిగాడు. ఈ నేపథ్యంలో ఆ నగలు తనదగ్గరే ఉన్నాయని..తన ఇంటికొచ్చి మాట్లాడమని కోరింది ప్రభావతి. దీంతో ఆమె ఇంటికి వెళ్లిన యోగేశ్వరరావుకు షాకిచ్చింది ప్రభావతి.
Also Read: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. తాటికొండ రాజయ్య రాజీనామా!
తనంటే ఇష్టమని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అంతేకాదు.. ఆ నగలతో వడ్డాణం చేయిస్తున్నానని చెప్పడంతో షాకయ్యాడు యోగేశ్వరరావు. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. తన సంతకాన్ని ప్రభావతి ఫోర్జరీ చేసి ఆభరణాలు కాజేసిందన్న ఫిర్యాదుతో.. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే ప్రభావతికి అంతకుముందే పెళ్లైందని..భర్తతో విబేధాలున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనూ పలువురిని మోసం చేసి డబ్బులు కాజేసినట్టు గుర్తించారు. దీంతో బ్యాంక్ మేనేజర్ హోదాలో ఆమె చేసిన నిర్వాకాలను చూసి మండిపడుతున్నారు స్థానికులు.