ఈ రోజు అసెంబ్లీలో జగన్ ను కలవడంపై ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్పందించారు. జగన్ తో ఆయన ఏం మాట్లాడారో ఆర్టీవీ ప్రతినిధికి ఎక్స్ క్లూజీవ్ గా వివరించారు. గతంలో కూడా తను చాలా డిబేట్ లలో జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని చెప్పానని గుర్తు చేశారు. ఈ రోజు కలిసిన సమయంలో కూడా అదే మాట చెప్పానన్నారు. అసెంబ్లీకి మిస్ కావొద్దని.. ప్రతీ రోజు రావాలని జగన్ తో అన్నట్లు వివరించారు. 'యెస్.. యు విల్ సీ' అని జగన్ కూడా నవ్వుకుంటూ సమాధానం ఇచ్చారన్నారు. తమ మధ్య శతృత్వం, రాజకీయ వైరం ఉన్నప్పటికీ.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కలుసుకున్న సందర్భంగా ఈ విషయాలు చెప్పానన్నారు.
ప్రతిపక్ష హోదా ఉన్నా.. లేకపోయినా ఒకటే ప్రతిపక్షం.. దానికి నాయకుడు ఆయన కాబట్టి అసెంబ్లీకి రావాలని చెప్పానన్నారు. గతంలో మీడియాకు చెప్పిన విషయాలనే ఆయనకు సైతం వివరించానన్నారు రఘురామ. దానికి జగన్ కూడా పాజిటివ్ గా స్పందించారన్నారు. తమ మధ్య ఇంతే జరిగిందన్నారు. జగన్ అసెంబ్లీ హాజరు అవుతాడని భావిస్తున్నానన్నారు. జగన్ పై తాను పెట్టిన కేసులు కొనసాగుతాయన్నారు. కేసుకు, తమ సంభాషణకు సంబంధం లేదన్నారు. తాను పెట్టిన కేసులకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఒక శాసన సభ్యుడిగా.. ఏకైక ప్రతిపక్షం అయిన వైసీపీ సభకు రావాలన్నదే తన కోరిక అని స్పస్టం చేశారు.