ఒడిశాలో ఘోర ప్రమాదం.. కల్వర్టు కూలి ఐదుగురు మృతి

ఒడిశా.. ఈ పేరు వినగానే దేశం మొత్తానికి ఇంకా ఘోర రైలు ప్రమాదమే గుర్తుకొస్తుంది. ఆ బాధ నుంచి ఇంకా కోలుకోక ముందే ఇటీవల కాలంలో ఆ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జనాలను కలవరపరుస్తున్నాయి. తాజాగా నిర్మాణంలో ఉన్న కల్వర్టు కూలి ఐదుగురు దుర్మరణం చెందారు.

New Update
ఒడిశాలో ఘోర ప్రమాదం.. కల్వర్టు కూలి ఐదుగురు మృతి

నలుగురు చిన్నారులు మృతి..

ఒడిశాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న కల్వర్టు కుప్పకూలి ఐదుగురు దుర్మరణం చెందగా.. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉండటం తీవ్ర విషాదం రేపింది. రాయగడ జిల్లాలోని ఉపరసజ గ్రామం సమీపంలో కల్వర్టును నిర్మిస్తున్నారు. అయితే సోమవారం ఉదయం కొంత మంది పిల్లలు సరదాగా స్నానం చేసేందుకు ఆ కల్వర్టు దగ్గరకు వెళ్లారు. పిల్లలు స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కల్వర్టు కుప్పకూలిపోయింది. దీంతో నలుగురు పిల్లలు సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను బయటికు తీశారు. ఐదుగురి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు రోదనతో స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.

కటక్‌లో రోడ్డు యాక్సిడెంట్.. 

ఆదివారం(జులై30) కూడా ఒడిశాలోని కటక్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. కేయింజార్ జిల్లాలోని గహీరా గ్రామం వద్ద జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీకొన్నాయి. జిల్లాకు చెందిన కొంతమంది బోల్బం దీక్షదారులు రెండు వాహనాల్లో జోడ ప్రాంతంలో ఉన్న మొర్గా మహాదేవ ఆలయానికి బయలుదేరగా గహీరా గ్రామం వద్ద ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12మంది దీక్షదారులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘోర రైలు ప్రమాదం..

గత జూన్ మొదటివారంలో ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అతివేగంగా వెళ్తున్న కోరమాండల్ రైలు ఆ స్టేషన్ దాటి సుమారు 500 మీటర్ల దూరంలో లూప్ లైన్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో రైలు సుమారు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీంతో రైలు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురయ్యాయి. ఆ వేగానికి పలు బోగీలు గూడ్స్ ట్రైన్ పైకి దూసుకువెళ్లాయి. పట్టాలు తప్పిన బోగీలు పక్కన ఉన్న మరో ట్రాక్‌పై పడిపోయాయి. అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొట్టింది. మొత్తానికి ఈ ఘోర ప్రమాదంలో 280మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు