తెలుగు నాయకుల్లో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం వైఎస్‌కు దక్కిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ రోజు విజయవాడలో జరుగుతున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ తనను చాలా అభిమానించేవారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ మరణించాక ఆయన మామూలు మనిషి కాదని తెలిసిందన్నారు.
వైఎస్ మరణించిన తర్వాత ఆయన ఫొటోలను వినాయక నిమజ్జనంలో విగ్రహాలతో పాటు ఊరేగించారన్నారు. ఆరోగ్యశ్రీ స్కీమ్ తో ఆయన ఎంతో మందికి ప్రాణం పోశారన్నారు. కాంగ్రెస్‌లో అసమ్మతి ఎదుర్కోని ఏకైక సీఎం వైఎస్ అని కొనియాడారు.
ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య శాశ్వత అనుబంధం కల్పించే అవకాశం ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి దొరికిందన్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రమే చేయగల పని ఇది అన్నారు. ఇది రేవంత్ రెడ్డికి సాధ్యం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.