Ukraine Peace Summit: రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై 840 రోజులు గడిచాయి. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధం శాంతియుతంగా ముగియాలని ఉక్రెయిన్ కోరుకుంటోంది. అందుకే శాంతి సదస్సు నిర్వహించారు. ఈరోజు స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో శాంతి సదస్సు ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్‌లో భారతదేశం పాల్గొంటుంది. అయితే, దీనికి రష్యాకు ఆహ్వానం లేదు. రష్యా-ఉక్రెయిన్ శాంతి ప్రణాళికను రూపొందించడానికి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రయత్నాలలో ఒకటి. ఈ ఏడాది మార్చిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత్‌ను అధికారిక శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించారు. జనవరి 2024లో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి శాంతి సూత్రంపై గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు స్విస్ ప్రభుత్వం ప్రకటించింది.
Ukraine Peace Summit: రెండు రోజుల సుదీర్ఘ శిఖరాగ్ర సమావేశం యుద్ధాన్ని నిరోధించడానికి నిర్వహించబడిన నాల్గవ శిఖరాగ్ర సమావేశం. గతంలో కోపెన్‌హాగన్, జెడ్డా మరియు మాల్టాలలో మూడు శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఈ సదస్సుకు స్విస్ అధికారులు 160 దేశాలను ఆహ్వానించారు. భారత్ సహా దాదాపు 90 దేశాల నేతలు లేదా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. అయితే, చాలా ప్రధాన దేశాలు ఏఈ సమావేశంలో పాల్గొనడానికి నిరాకరించాయి. రష్యా కీలక మిత్రదేశం చైనా కూడా ఈ సదస్సుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ప్రస్తుత జి20 అధ్యక్షుడు బ్రెజిల్ కూడా అదే పని చేశారు. అదే సమయంలో, సౌదీ అరేబియా, పాకిస్తాన్ కూడా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనవు.
Ukraine Peace Summit: ఉక్రెయిన్‌కు అతిపెద్ద మద్దతుదారు అయిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా ఈ సదస్సుకు హాజరుకావడం లేదు. అయితే ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హాజరుకానున్నారు.
Ukraine Peace Summit: స్విట్జర్లాండ్‌లో జరిగే ప్రపంచ నేతల సమావేశానికి రక్షణగా 4,000 మంది సైనికులను మోహరించారు. ఇంకా, సంఘటన స్థలం దగ్గర ఒక స్టీల్ రింగ్ ఉంచారు. చుట్టుపక్కల 6.5 కి.మీ ప్రాంతం ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 8 కి.మీ పొడవునా మూళ్ళ కంచె తో నెట్ వర్క్ కూడా వేశారు. స్విస్ మిలటరీకి ఆ ప్రాంతంలో భద్రతను అప్పగించారు. వైమానిక దళం నిరంతరం ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తోంది. సైట్ సమీపంలో నిర్మించిన హెలిపోర్ట్ రక్షణ కోసం ఐదు సైనిక హెలికాప్టర్లను మోహరించారు. దీంతోపాటు డబుల్ లేయర్ ఫెన్సింగ్ కూడా చేశారు.
Ukraine Peace Summit: శిఖరాగ్ర సమావేశానికి ముందు ప్రధాని మోదీ శుక్రవారం ఇటలీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలిశారు. రష్యా-ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారానికి భారత్ మద్దతిస్తుందని జెలెన్స్కీకి ప్రధాని చెప్పారు. దౌత్యం- చర్చలు మాత్రమే ఈ యుద్ధాన్ని ముగించగలవు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఈ సదస్సులో బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, అమెరికా ఉపాధ్యక్షుడు కమలా హారిస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొంటారు.