ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరో సంచలనం నమోదైంది. జింబాబ్వే కన్నా పసికూన జట్టుగా ఉన్న యూఏఈ.. చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి తెరతీసింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్-యూఏఈ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది. మొదటి టీ20 మ్యాచులో గెలిచిన కివీస్ జట్టుకు రెండో టీ20లో భారీ షాక్ తగిలింది. తొలుత టాస్ గెలిచిన యూఏఈ బౌలింగ్ ఎంచుకుంది.
దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఓ దశలో 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే మార్క్ చాప్‌మాన్ 46 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లలతో 63 పరుగులు చేసి ఆదుకున్నాడు. చాడ్ బోస్ (21), జిమ్మీ నీషమ్ (21) మినహా మిగిలిన బ్యాటర్లెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేదు. ఇక యూఏఈ బౌలర్లలో ఆఫ్జల్ ఖాన్ మూడు వికెట్ల తీయగా.. జవదుల్లా రెండు వికెట్లు, అలీ నసీర్, జహుల్ ఖాన్, ఫరజుద్దీన్ ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆ జట్టు కెప్టెన్ మహ్మద్ వసీం కేవలం 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేసి అదరగొట్టాడు. అసిఫ్ ఖాన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 48 పరుగులు చేయగా.. అర్వింద్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 25 పరుగులతో రాణించాడు. దీంతో 26 బంతులు మిగిలి ఉండగానే టార్గెల్ ఛేదించి న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ ఇచ్చింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథి, సాంటిర్న్, జేమిసన్ ఒక్కో వికెట్ తీశారు. మూడు వికెట్లతో రాణించిన ఆఫ్జల్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 ఆదివారం జరగనుంది.