New Year 2024 : అసలు న్యూ ఇయర్(New Year 2024) ని జనవరి ఒకటినే ఎందుకు జరుపుకోవాలి? 'సంవత్సరం' అనేది సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి భూమికి పట్టే సమయం. ఇది సుమారు 365.25 రోజులు. మనం సాధారణంగా ఉపయోగించే క్యాలెండర్ దీని ఆధారంగానే రూపొందిస్తారు. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న క్యాలెండర్‌ని గ్రెగోరియన్ క్యాలెండర్(Gregorian Calendar) అంటారు. దీని ప్రకారం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఒక సంవత్సరం అని లెక్కిస్తున్నాం. కానీ క్లియర్‌గా ఆలోచిస్తే ఏదైనా 12 నెలలు లేదా.. 365 రోజులను ఒక సంవత్సరం అని అనవచ్చు. మరీ కేవలం జనవరి ఒకటికే సంవత్సరం పూర్తయిందని చెప్పడం ఏంటి? ఫిబ్రవరి ఒకటి నుంచి తర్వాత వచ్చే జనవరి 31 వరకు కూడా 365 రోజులే ఉంటుంది కదా.. మరి ఫిబ్రవరీ ఒకటినే న్యూ ఇయర్ అని ఎందుకు అనడం లేదు..? ఈ ప్రశ్నలతో పాటు అసలు న్యూ ఇయర్ చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
నూతన సంవత్సర కాన్సెప్ట్ పురాతన కాలం నుంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులలో న్యూఇయర్‌ని జరుపుకుంటారు. కొత్త సంవత్సరం ప్రారంభం ఎక్కువుగా ఖగోళ సంఘటనలు లేదా మతపరమైన సంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. అసలు ఈ న్యూఇయర్ కాన్సెప్ట్ చరిత్ర గురించి తెలుసుకుందాం:
మెసొపొటేమియా : మొట్టమొదటిగా నూతన సంవత్సర వేడుకలు మెసొపొటేమియాలో జరిగాయని చరిత్ర చెబుతోంది. 4,000 సంవత్సరాలకు ముందే బాబిలోనియన్లు న్యూఇయర్ జరుపుకున్నారు. మార్చి చివరలో వీరు నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు. వారి నూతన సంవత్సర వేడుకలు పదకొండు రోజులు కొనసాగేవి. వివిధ రకాల మతపరమైన ఆచారాలు, ఉత్సవాలతో కన్నులపండువగా న్యూఇయర్‌ని సెలబ్రేట్ చేసుకునేవాళ్లు.
రోమన్ క్యాలెండర్: తొలి రోమన్ క్యాలెండర్ మార్చి 1ని నూతన సంవత్సరంగా జరిపింది. అయినప్పటికీ ఆ తర్వాత క్యాలెండర్ అనేక మార్పులకు గురైంది . 45 BCEలో, జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. రోమన్ ప్రారంభ దేవుడైన జానస్‌ను గౌరవించటానికి జనవరి 1ని సంవత్సరం ప్రారంభంగా చెప్పాడు. జనవరి 1న న్యూఇయర్ జరుపుకోవడానికి ఇది కూడా ఒక కారణం.
మధ్యయుగ యూరప్‌లో క్రిస్టియన్ చర్చి మార్చి 25న కొత్త ఏడాదిని జరుపుకునేది. అయితే 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఆమోదించడంతో. చాలా పాశ్చాత్య దేశాలు జనవరి 1న న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టాయి.
చైనీస్ న్యూ ఇయర్: చైనీస్ క్యాలెండర్‌లో నూతన సంవత్సరం చంద్ర క్యాలెండర్ ఆధారంగా జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్య వస్తుంది.
ఇస్లామిక్ నూతన సంవత్సరం: ఇస్లామిక్ నూతన సంవత్సరం, హిజ్రీ న్యూ ఇయర్ లేదా ఇస్లామిక్ న్యూ హిజ్రీ ఇయర్ అని కూడా పిలుస్తారు. ఇది చంద్ర క్యాలెండర్ ఆధారంగా ఉంటుంది. 622 CEలో మక్కా నుంచి మదీనాకు ప్రవక్త ముహమ్మద్ వలస వచ్చినట్లు సూచిస్తుంది.
యూదుల నూతన సంవత్సరం: రోష్ హషానా అనేది యూదుల నూతన సంవత్సరం. సాధారణంగా సెప్టెంబర్‌లో జరుగుతుంది.
ఉగాది: యుగాది అని కూడా పిలిచే ఉగాదిని భారత్‌లోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త సంవత్సర దినోత్సవంగా జరుపుకుంటారు. 'యుగాది' అనే పదం సంస్కృత పదాల నుంచి వచ్చింది. 'యుగ' అంటే యుగం.. 'ఆది' అంటే ప్రారంభం అని అర్థం. ఉగాది కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఉగాది వేడుక చాంద్రమాన హిందూ క్యాలెండర్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది చైత్ర మాసం మొదటి రోజును సూచిస్తుంది. చంద్ర క్యాలెండర్ ఆధారంగా ఉగాది మార్చి లేదా ఏప్రిల్‌లో వస్తుంది. ఇది వసంతకాలం ప్రారంభానికి ప్రతీక.
ఇలా న్యూఇయర్ అన్నది కొన్ని ప్రాంతాల్లో సూర్యుడి ఆధారంగా.. మరికొన్ని ప్రాంతాల్లో చంద్రుడి ఆధారంగా.. ఇంకొన్ని ప్రాంతాల్లో వారి ఆచారాలు, మతాలకు సంబంధించిన ప్రాముఖ్యతలకు తగ్గట్టుగా జరుపుకుంటారు. ఇందులో ఒకటి కరెక్ట్ న్యూఇయర్.. ఇంకోటి రాంగ్ న్యూఇయర్ అని చెప్పడానికి వీల్లేదు. ప్రతీదానికి ఏదో ఒక లాజిక్‌తో పాటు శాస్త్రం కూడా మూడిపడి ఉంటుంది. ఒకవేళ ముడిపడి లేకున్నా మనకు వచ్చే నష్టమేమీ లేదు కదా. అందుకే మాదే కరెక్ట్ న్యూఇయర్ మీదు కాదు అని వాదించుకోవద్దు. ఇదంతా తలనొప్పి వ్యవహారం.. అనవసరంగా బుర్ర పాడుచేసుకోవద్దు. అన్నీ న్యూఇయర్స్‌ను గౌరవించండి.. వీలైతే అన్నిటీని సెలబ్రేట్ చేసుకోండి. మన ఇండియాలో జనవరి ఒకటి కాకుండా రీజియన్ బట్టి ఇంకో న్యూఇయర్ వస్తుంది. అంటే రెండుసార్లు జరుపుకునే అదృష్టం ఉన్నట్టు లెక్క.. అంటే రెండు రోజులు ఫ్రెండ్స్‌తో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే టైమ్ మనకి లభిస్తునట్టు కదా.. మరి మరో మాట లేకుండా హ్యాపీగా ఉండండి.. అందరికీ హ్యాపీ న్యూఇయర్!
Also Read: న్యూ ఇయర్ రోజున బాయ్‌ఫ్రెండ్‌కి ఈ గిఫ్ట్ ఇవ్వండి.. ఇంప్రెస్ అవ్వకపోతే అడగండి!
WATCH: