TTD Board Members in Liquor case: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి ప్రకటన తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో అరెస్టై బెయిల్‌పై విడుదలైన శరత్ చంద్రారెడ్డికి (Sarath Chandra Reddy) కొత్తగా చోటు కల్పించడంతో పాటు అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసిన కేతన్ దేశాయ్ (Ketan Desai)ను కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది. వైసీపీలో నెంబర్2గా ఉన్న విజయసాయిరెడ్డి అల్లుడే శరత్ చంద్రారెడ్డి. ఆయన ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై అప్రూవర్‌గా మారారు.
నూతన పాలకమండలి నియామకంపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బోర్డు మెంబర్లుగా నియమించిన అవినీతిపరులను వెంటనే తొలగించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ధర్మపాలకమైన పాలకమండలిలో అవినీతిపరులకు చోటు ఎలా కల్పిస్తారంటూ ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక చింతన, హిందూ మత సంప్రదాయాలను పాటించే వారినే బోర్డు సభ్యులుగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక దొంగల ముఠాను టీటీడీ (TTD) పాలకమండలి సభ్యులుగా నియమించారని జనసేన (Janasena) నేత కిరణ్ రాయల్ విమర్శించారు. తిరుమల పవిత్రతను ప్రభుత్వం మంటగలిపిందని మండిపడ్డారు. శరత్ చంద్రారెడ్డిని పాలకమండలి సభ్యునిగా తొలగించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మరో జనసేన నేత పోతిన వెంకట మహేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలయ ప్రతిష్టను, కోట్లాది హిందువుల మనోభావాలను తాకట్టు పెడతారా అంటూ మండిపడ్డారు.
ఇక మంత్రి పదవులు ఆశించిన వైసీపీ ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ (ముమ్మిడివరం), సామినేని ఉదయభాను(జగ్గయ్యపేట), తిప్పేస్వామిల(మడకశిర)కు చోటు కల్పించింది. ఇక ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మేకా శేషుబాబు, గాదిరాజు వెంకట సుబ్బరాజు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుమారుడు శిద్ధా సుధీర్ పాలకమండలిలో స్థానం దక్కించుకున్నారు.
ఇక కడప ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరుడైన మాసీమ బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అనుచురడు సిద్ధివటం యానాదయ్యకూ అవకాశం కల్పించారు. యానాదయ్య నాయీ బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గానూ కొనసాగుతున్నారు. డాక్టర్ కేతన్ దేశాయ్‌ను మరోసారి కొనసాగించారు. ఈయన ఎంసీఐ చైర్మన్‌గా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలపై సీబీఐ చేతిలో అరెస్ట్ అయ్యారు. తెలంగాణ నుంచి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి భార్య గడ్డం సీతారంజిత్ రెడ్డి, సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి... తమిళనాడు నుంచి బాలసుబ్రమణియన్ పళనిస్వామి, కృష్ణమూర్తి వైద్యనాథన్, డాక్టర్ ఎస్.శంకర్.. కర్ణాటక నుంచి యలహంక ఎమ్మెల్యే విశ్వనాథ్ రెడ్డి, హలియాల్ ఎమ్మెల్యే రఘునాథ్ విశ్వనాథ్ దేశ్‌పాండే.. మహారాష్ట్ర నుంచి అమోల్ కాలే, మిలింద్ కేశవ్ నర్వేకర్, బొరా సౌరభ్లకు చోటు కల్పించారు.
Also Read: ఏపీలో వేడెక్కిన రాజకీయాలు.. ఓట్ల గల్లంతుపై అధికార, విపక్షాల ఆరోపణలు