TSRTC Free Journey Scheme: తెలంగాణలోని (Telangana) పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ పథకానికి సంబంధించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) కీలక ప్రకటన చేశారు. "మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం" వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఆ గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుందని వివరించారు. పాన్ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదన్నారు సజ్జనార్ (Sajjanar).
ఇది కూడా చదవండి: TS Government: ఆరు గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ లు చూపిస్తున్నారని TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందన్నారు. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు. మహిళా ప్రయాణికులందరూ తమ ఒరిజనల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు.
ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని కోరారు. ఇంకా.. 'ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం' అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారని. ఇది సరికాదన్నారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును TSRTC కి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని వివరించారు.
జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారని అన్నారు. కావున బస్సు ఎక్కగానే ప్రతీ మహిళ జీరో టికెట్‌ను తీసుకోవాలని కోరారు. ఒక వేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందననారు. టికెట్ లేని వారికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని కోరారు సజ్జనార్.