TSRTC: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. ఆ జిల్లాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు డీలక్స్ బస్సు.. వివరాలివే!

వేములవాడ నుంచి సిరిసిల్ల, సిద్దిపేట మీదుగా శంషాబాద్ కు స్పెషల్ బస్ సర్వీసును ప్రవేశపెట్టింది తెలంగాణ ఆర్టీసీ. ప్రతీ రోజు సాయంత్రం 4:30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరి సాయంత్రం 9 గంటలకు శంషాబాద్ కు చేరుకుంటుంది.

New Update
TSRTC: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. ఆ జిల్లాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు డీలక్స్ బస్సు.. వివరాలివే!

ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు చెందిన అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాల్లో నివసిస్తుంటారు. గల్ఫ్ వెళ్లే వారు బస్సుల ద్వారా శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఫ్లైట్ లో వెళ్తుంటారు. అయితే.. శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు నేరుగా బస్సు సర్వీసులు (TSRTC New Bus Service) లేకపోవడంతో హైదరాబాద్ కు వచ్చి మళ్లీ అక్కడి నుంచి శంషాబాద్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో టైం వేస్ట్ కావడంతో పాటు.. డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇలాంటి వారికి తెలంగాణ ఆర్టీసీ (TSRTC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. వేములవాడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కొత్త సర్వీసును ప్రవేశపెట్టినట్లు ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సర్వీసు శుక్రవారం సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ డీలక్స్ బస్సు ప్రతీ రోజు సాయంత్రం 4:30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరుతుందని తెలంగాణ ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అక్కడి నుంచి సిరిసిల్ల, సిద్దిపేట, జేబీఎస్‌ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. ఈ బస్సు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకునేసరికి రాత్రి 9 గంటలు అవుతుంది.

అనంతరం.. శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ నుంచి ఈ బస్సు ఉదయం 6 గంటలకు బయలుదేరి 10 గంటలకు వేములవాడకు చేరుకుంటుందని తెలంగాణ ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట తదితర ప్రాంతాల నుంచి దుబాయ్, మస్కట్, తదితర ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఈ బస్సు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కోరింది.

Advertisment
తాజా కథనాలు