లక్కున్నోళ్లకే లిక్కర్ లైసెన్సులు.. లక్కీ డ్రాకు అంతా రెడీ

తెలంగాణలో లిక్కర్ షాపుల టెండర్లకు వేళైంది. సోమవారం లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులు కేటాయించనున్నారు. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ అంతా రెడీ చేసింది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

New Update
Telangana News: తెలంగాణలో మందుబాబులకు షాక్.. 3 రోజులు వైన్స్ బంద్.. ఎందుకంటే?

మరికొన్ని గంటల్లో అదృష్ట దేవత ఎవరిని వరించనుందో తేలిపోనుంది. తెలంగాణలో లిక్కర్ షాపుల టెండర్ల కేటాయింపును లక్కీ డ్రా ద్వారా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ అన్ని ఏర్పాటు పూర్తిచేసింది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2023-25 మద్య పాలసీకి సంబంధించి కొత్త షాపుల ఏర్పాటకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి ప్రారంభమైన దరఖాస్తు స్వీకరణ ఆసగ్టు 18తో ముగిసింది. ఎన్నడూ లేని రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించారు.

ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 294 మద్యం దుకాణాలకు కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 15,894 దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 234 మద్యం షాపులకు 21,615 దరఖాస్తులు.. సరూర్‌నగర్‌లోని 134 మద్యం షాపులకు 10,994 దరఖాస్తులు.. శంషాబాద్‌ ఎక్సైజ్‌ యూనిట్‌ పరిధిలోని 100 మద్యం షాపులకు 10,621 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,31,493 దరఖాస్తులు వచ్చాయంటే మద్యంపై ఆదాయం ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు లక్షకు పైగా దరఖాస్తులు రావడంతో సర్కార్ ఖజానాకు కాసుల వర్షం కురిసింది. దాదాపు రూ.2000కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో లక్కీ డ్రా కార్యక్రమం పారదర్శకంగా జరిగేందుకు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వీడియో తీయనున్నారు. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లో లక్కీ డ్రా నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. లాటరీలో పేర్లు వచ్చిన వారికి వెంటనే షాపుల కేటాయింపు ఉత్తర్వులు అందజేయనున్నారు. లాటరీ ప్రక్రియ విషయంలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు.

మరోవైపు ఎన్నికలు మరో మూడు నెలలే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం టెండర్లు పిలవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ టెండర్లు వేస్తామని ఇప్పటికే స్పష్టంచేశారు. అటు బీజేపీ కూడా మద్యం టెండర్లపై తీవ్ర విమర్శలు చేస్తుంది. ఇప్పుడు లైసెన్సులు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకపోతే లైసెన్సులు రద్దు చేస్తారేమో అన్న ఆందోళన కూడా కొంతమందిలో నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు