TS Tenth Exams 2024: తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఎల్లుండి అంటే... మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతీ కేంద్రానికి ఒకరు చొప్పున మొత్తం 2,676 మంది చీఫ్ సెపరింటెండెంట్లు ఉంటారన్నారు. ఈ కేంద్రాల్లో మొత్తం 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. 30 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుందని చెప్పారు. విద్యార్థులు 5 నిమిషాల వరకూ ఆలస్యంగా వచ్చినా ప్రవేశం కల్పిస్తామన్నారు. పరీక్షలను సీసీ కెమరాల ద్వారా పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఇది కూడా చదవండి: TS Teacher Jobs: టీచర్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
కాపీయింగ్ కు పాల్పడితే డిబార్..
పరీక్షల్లో విద్యార్థులు ఎవరైనా కాపీయింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వారిని మిగిలిన పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని ప్రకటించారు. పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులు, సిబ్బందిపై నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎగ్జామ్ ముగిసిన తర్వాతనే విద్యార్థులు, సిబ్బంది బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామన్నారు. మధ్యలో బయటకు పంపించమని స్పష్టం చేశారు.
ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్..
పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నట్లు చెప్పారు. స్టూడెంట్స్ తో పాటు, పరీక్షల సిబ్బంది ఎవరూ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లడం నిషేధం ఉంటుందన్నారు. ఇంకా స్టూడెంట్స్ హాల్ టికెట్, ప్యాడ్, పెన్, పెన్సిల్, స్కేల్ షార్ప్ నర్, ఎరేజర్, జామెట్రీ పరికరాలు మాత్రమే తీసుకుని వెళ్లడానికి అనుమతి ఉంటుందన్నారు.