/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Ponguleti-Srinivas-Reddy.jpg)
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకే విమానంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి ప్రయాణించడం, ఆ వీడియో వైరల్ కావడం చర్చనీయాశంగా మారింది. మంత్రి పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కొచ్చిన్ వెళ్లారు. వారితోపాటు అదే విమానంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రయాణించారు. ముందు, వెనుక సీట్లలోనే కాంగ్రెస్ నేతలు, రోహిత్‌రెడ్డి కూర్చున్నారు. ఇండిగో 6A-6707 విమానంలో హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లారు ఈ నేతలు.
అయితే.. విమానంలో సాంకేతిక లోపంతో ప్రయాణం ఆలస్యమైంది. టేకాఫ్ కోసం రన్‌వేపై ఫ్లైట్ దాదాపు గంట పాటు నిలిచిపోయింది. దీంతో విమానంలో ప్రయాణికులు వేచి చూస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నేత పైలెట్ రోహిత్ రెడ్డి ఉండడం చర్చనీయాంశంగా మారింది.
దీంతో.. పైలెట్ పార్టీ మారుతారా? ఆయన పొంగులేటితో ఈ విషయమై చర్చించారా? అన్న ఊహగానాలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. పైలెట్ రోహిత్ రెడ్డి 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.