తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అమిత్ షా సభకు భారీ ఏర్పాట్లు చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. లక్ష మందితో సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు పార్టీని వీడతారంటూ సాగుతున్న ప్రచారంపై బీజేపీ అగ్రనేతలు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TS Elections 2023: కేసీఆర్‌కు షాక్.. సీఎంపై పోటీకి 120మంది..!
ఈ నేపథ్యంలో సూర్యాపేట మీటింగ్ తర్వాత అసంతృప్త నేతలతో అమిత్ షా స్వయంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో నేతల సందేహాలను అమిత్ షా నివృత్తి చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా మీటింగ్ తర్వాత తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు వస్తుందని.. వలసలకు చెక్ పడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 27న అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ ఎన్నికల్లో జనసేన-బీజేపీ పొత్తులపై ఈ ఇరువురు నేతల నడుమ చర్చ జరగనున్నట్లు సమాచారం. తమకు 20 సీట్లు కేటాయించాలని తెలంగాణ జనసేన పార్టీ నేతలు కోరుతుండగా.. 8-10 సీట్లు ఇస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నట్లు తెలుస్తోంది. అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీలో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ వారంలోనే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 40 మందితో రెండో జాబితా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కీలక నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్ ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు.