తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukhendar Reddy) పార్టీ మారుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో (Social Media) దుష్ప్రచారం సాగుతోందని మండిపడ్డారు. తాను పార్టీ మారడం లేదని.. పార్టీ మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు రాజ్యాంగ బద్ధమైన శాసన మండలి ఛైర్మన్ పదవిలో ఉన్నానని.. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టబద్ధంగా తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తున్నానన్నారు. తన సంపూర్ణ సహకారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. ప్రభుత్వానికి అవసరం అయిన సలహాలు, సూచనలు అందిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: కేసీఆర్ కు రేవంత్ పరామర్శ అందుకే.. పొన్నాల లక్ష్మయ్య వివాదాస్పద వాట్సాప్ స్టేటస్!
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా సాధ్య అసాధ్యలను బేరీజు వేసుకోవాలని సూచించారు గుత్తా. ఏమి అమలు చేయగలుగుతాం, ఏమి అమలు చేయలేమన్న అంశంపై ఒక అంచనాకు రావాలన్నారు. ప్రజలకు వాస్తవ పరిస్థితి వివరించి పథకాలు అమలు చేయాలని సూచించారు. వాస్తవం చెబితే ప్రజలు తప్పకుండా అర్థం చేసుకుంటారన్నారు. బీఆర్ఆస్ పార్టీ అధిష్టానం కూడా ఎందుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చారు అనేది విశ్లేషణ చేసుకుంటుందన్నారు. కేసీఆర్ పై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. ఆయన పట్ల ప్రజలకు ప్రేమ, విశ్వాసం అలాగే ఉన్నాయన్నారు.
కేసీఆర్ రావాలి, మా ఎమ్మెల్యే పోవాలనే విధంగా ప్రజలు ఓట్లు వేశారన్న అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వచ్చేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని తాను అనుకోవడం లేదన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేటీఆర్ పని తీరుకు ఓట్లు పడ్డాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమన్నారు. అధికారం అనేది ఎవరికీ శాశ్వతంగా ఉండదన్నారు.
మంత్రులు చేస్తున్న కామెంట్స్ పేపర్ లలో చూశాన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెండు మంత్రి పదవులు రావడం సంతోషకరమన్నారు. ఇద్దరు మంత్రులు కూడా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నానన్నారు. జిల్లాలో ఇరిగేషన్ పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. మంత్రి సమయం ఇస్తే త్వరలోనే రివ్యూ పెట్టాలని అడుగుతున్నానన్నారు. రివ్యూలో తాను కూడా పాల్గొంటానన్నారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పని చేస్తారని నమ్మకం ఉందన్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా బయటకు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.