సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి వర్గం చర్చించనునుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిప్పి పంపిన బిల్లుల విషయంలో తదుపరి కార్యాచరణ ఎలా వుండాలనే విషయంపై చర్చించనున్నట్టు సమాచారం.
ఇటీవల వీర్ఏల క్రమబద్దీకరణ, సర్దుబాటు అంశాలపై అధికారులతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో వీఆర్ఏల అశంపై చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలైన రైతు రుణమాఫీ, గృహలక్ష్మీ, బీసీ, మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థికసాయం లాంటి పథకాలు అమలవుతున్న తీరు, వాటి పురోగతి విషయాలపై చర్చించనున్నారు.
రంగారెడ్డి బుద్వేల్ లో ప్రభుత్వ భూముల వేలానికి హెచ్ఎండీఏ అనుమతులు, అమ్మకానికి ప్రతిపాదనలు, ఓఆర్‌ఆర్ వెంట మెట్రోరైలు, మరో 5 కొత్త మెట్రోలైన్ కారిడార్లకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని మల్యాలలో హార్టికల్చర్ కళాశాల ఏర్పాటుకు అనుమతులు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
వాటితో పాటు నిమ్స్ విస్తరణ వ్యయం పెంపు, దాని కోసం బ్యాంక్ నుంచి రుణాలు తీసుకునేందుకు అనుమతులు వరంగల్ శివారులోని మామునూరు ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ పనులు, కొత్త గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాల్టీల ఏర్పాటు ప్రతిపాదనలు వంటి అంశాలపై కేబినెట్ చర్చించనుంది.
శాసనసభ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో శాసన సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విపక్షాలను ఎదుర్కొనే అంశం గురించి చర్చించే అవకాశం ఉంది. 2022 పురపాలక నిబంధనలు, డీఎమ్ఈ పదవీ విరమణ వయస్సు పెంపు సహా.. పంచాయతీరాజ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లుల విషయంలో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు.