ఈ నెల 12 లేదా 13న తమ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది తెలంగాణ బీజేపీ (Telangana BJP). అయితే విడుదల కాకముందే మేనిఫెస్టోలోని పలు అంశాలు బయటకు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు నగరాలకు వాటి పాత పేర్లను పెట్టాలని బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో అనేక సార్లు బీజేపీ నేతలు చెప్పినట్లుగా హైదరాబాద్ (Hyderabad) పేరును భాగ్యనగర్ గా మారుస్తామని మేనిఫెస్టో ద్వారా మరో సారి స్పష్టం చేయనున్నారు. నిజామాబాద్ పేరును ఇందూరుగా వికారాబాద్ ను గంగవరంగా, కరీంనగర్ ను కరీనగర్ గా మార్చుతామని బీజేపీ మేనిఫెస్టో ద్వారా చెప్పనుంది. వీటితో పాటు మహబూబ్ నగర్ ను పాలమూరు గా, అదిలాబాద్ ను ఎదూలపురంగా, మహబూబాబాద్ ను మానుకోట గా మారుస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో వెల్లడించనుంది.
ఇది కూడా చదవండి: Telangana BJP: విజయశాంతికి షాక్ ఇచ్చిన బీజేపీ.. స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇదే!
ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన బీజేపీ.. ఎస్సీల కోసం మరో సంచలన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు హైదరాబాద్ లో పర్యటించనున్న నరేంద్రమోదీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దళితరత్న పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ కింద పలు సబ్సిడీలు, ఇంకా ఇతరాత్ర ప్రోత్సహకాలు ఉండనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. శేరిలింగంపల్లి టికెట్ ఆశిస్తున్న యోగానంద్ చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. నిజామాబాద్ కు చెందిన అర్వింద్ తో శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కోరుట్లలో తనకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారని పరోక్షంగా ఎంపీ అర్వింద్ కు వార్నింగ్ ఇచ్చారు.