ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. ఈఘటనలో ఓ మహిళ సహా ఐదుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టకు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బుధవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఖుషినగర్‌లోని నగరపంచాయతీ రాంకోలాలోని ఉర్ధా గ్రామంలోని గుడిసెలో మంటలు చెలరేగాయి. గుడిసెలో ఐదుగురు పిల్లలతో నిద్రిస్తున్న మహిళ సజీవ దహనమైంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా మేజిస్ట్రేట్ రమేష్ రంజన్, పోలీసు సూపరింటెండెంట్ ధవల్ జైస్వాల్, ఏఎస్పీ రితేష్ కుమార్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్ధా గ్రామంలో నౌమి సర్జు ఇంట్లోఅతని భార్య సంగీత (38), అతని కుమారుడు అంకిత్ (10), లక్ష్మి (9), రీటా (3), గీత (2), ఏడాది బాబు సజీవదహనమయ్యారు.
అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వారికి బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. స్థానికుల సమచారంతో రంజన్, ఎస్పీ ధవల్ జైస్వాల్ సహా ఆరోగ్య శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. అర్థరాత్రి జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే షార్ట్ సర్క్కూట్ తో ఈ ప్రమాదం జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.