Deputy CM Mallu Bhatti Vikramarka : తెలంగాణ(Telangana) ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు భట్టి వెంకటేశ్వర్లు(Bhatti Venkateshwarlu) మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి(AIG Hospital) లో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. మల్లు వెంకటేశ్వర్లు వయసు 70 సంవత్సరాలు. ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గా, అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఆ తరువాత కూడా వైరా నుండి ఒకటవ వార్డులో తన నివాసంలోనే హోమియో వైద్యశాలను నిర్వహించారు. హోమియో వైద్యునిగా మంచి గుర్తింపు ఉండటంతో అనేక ప్రాంతాల నుండి వైద్యం చేయించుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చేవారు.
Also Read : మేడిగడ్డ కూలిందా.. కూల్చేశారా తేల్చేద్దాం పదండి: రేవంత్ రెడ్డి
కాగా, గత మూడు నెలలుగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు బంధువులు తెలిపారు. ఆరోగ్యం క్షీణించటంతో ఇటీవల గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ(Asian Institute Of Gastro Enterology) లో ఆయనను చేర్పించారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే మూడు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. దీంతో, ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు. మల్లు వెంకటేశ్వర్లు మృతదేహానికి స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో భట్టి విక్రమార్క ఖమ్మం బయలుదేరి వెళ్లారు. మల్లు వెంకటేశ్వర్లు మరణ వార్తతో స్థానికులు, స్నానాల లక్ష్మీపురం గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.