Rajadani Express: విధి నిర్వహణలో భాగంగా ఓ ట్రాక్ మ్యాన్ చూపించిన తెగువ, సమయస్ఫూర్తి...ఓ రైలుకు పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. పట్టాలపై వెల్డింగ్ లోపాన్ని గుర్తించిన ట్రాక్‌మ్యాన్ అదే మార్గంలో వస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ను ఆపేందుకు పట్టాల వెంట ఐదు నిమిషాల్లో అర కిలోమీటరు మేర పరుగులు తీయడం గమనార్హం. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మహాదేవ అనే ట్రాక్ మ్యాన్ తన విధుల్లో భాగంగా కొంకణ్ రైల్వే డివిజన్ లోని కుమ్టా, హొన్నావర్ స్టేషన్ ల మధ్య తనిఖీలు చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే తెల్లవారుజామున 4.50 గంటల ప్రాంతంలో ఓ చోట పట్టాల జాయింట్ వద్ద వెల్డింగ్ అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించాడు. అప్పటికే ఆ మార్గంలో తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ వస్తోంది.
దీంతో వెంటనే అప్రమత్తమైన అతడు...కుమ్టా స్టేషన్ కు సమాచారం అందించాడు. అయితే..అప్పటికే రైలు ఆ స్టేషన్ ను దాటేసింది. దీంతో నేరుగా లోకో పైలట్ ను సంప్రదించేందుకు యత్నించాడు. అది విఫలమైంది. దీంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా..రైలును ఆపేందుకు పట్టాల వెంట పరుగులు పెట్టాడు. ఐదు నిమిషాల్లో అర కిలోమీటర్ మేర పరిగెత్తి...లోకో పైలట్ కు సిగ్నల్ అందించి..సకాలంలో రైలును నిలిపివేయించారు.
వెల్డింగ్ పని పూర్తయిన అనంతరం ..రైలు తిరిగి గమ్య స్థానానికి బయల్దేరింది. వందలాది ప్రయాణికుల భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహాదేవను ఉన్నతాధికారులు కొనియాడుతున్నారు. అతడిని సత్కరించి ..రూ . 15 వేల నగదు బహుమతిని అందించారు.
Also Read: గోల్డ్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర!