"మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించనున్నామని రేవంత్ తెలిపారు. రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15000, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12000 అందిస్తామని వెల్లడించారు.. గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. యువ వికాసం ద్వారా చదువుకునే విద్యార్థులకు రూ.5 లక్షల వరకు సాయం అందిస్తామన్నారు. చేయూత పథకం ద్వారా రూ.4 వేలు పెన్షన్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందని.. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఆరోగ్యబీమా అందిస్తామని చెప్పారు.
వందరోజుల్లో ఈ గ్యారంటీలను అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌కు ఇక మిగిలింది మరో 99 రోజులేనన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను నెరవేర్చారన్నారు. తెలంగాణ తల్లి సోనియమ్మను స్వాగతించాల్సింది పోయి.. బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సోనియాగాంధీ తెలంగాణకు రావడంతో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంల ముసుగులు తొలగిపోయాయని దుయ్యబట్టారు. వీళ్లంతా ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆర్ఎస్ నేతలు కకావికలం అవుతున్నారని ఎద్దెవ చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలపై చర్చ పెట్టండి అంటూ సవాల్ విసిరారు . తాము అధికారంలోకి వచ్చాక ధరణిని 100శాతం రద్దు చేస్తామని కర కండిగా చెప్పేశారు. కేసీఆర్ దోపిడీ పాలనను బొంద పెట్టడం ధరణితోనే మొదలుపెడతామని ఆయన అన్నారు. ధరణి కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లాంటిదని ధ్వజమెత్తారు.