టీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఇలా చేయాల్సిందే? 25 వరకూ గడువు

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. నేటి నుంచి ఈనెల 25 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి విక్రమార్క దరఖాస్తు నమూనాను విడుదల చేశారు.

టీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఇలా చేయాల్సిందే? 25 వరకూ గడువు
New Update

ఎన్నికల యుద్ధంలోకి తెలంగాణ కాంగ్రెస్ కాలు దువ్వింది. ఎలక్షన్ ప్రక్రియను అధికారికంగా షురూ చేసింది. ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. సీఏల్పీ నేత భట్టి విక్రమార్క,  ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్, ఇతర నేతలతో కలిసి దరఖాస్తు నమూనాను విడుదల చేశారు. నేటి నుంచి ఈనెల 25 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రతిరోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు తీసుకోనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు రుసుమును రూ.25వేలుగా నిర్ణయించామని రేవంత్ తెలిపారు. బీసీ, ఓసీ అభ్యర్థులకు రూ.50వేలుగా ఉంటుందన్నారు. దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదని.. ఈ డబ్బును పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తామన్నారు. ఈ నెల 25 తర్వాత దరఖాస్తులను స్క్రూటిని చేస్తామని పేర్కొన్నారు. ప్రతి దరఖాస్తుదారుడి బలాలు, బలహీనతలపై సర్వేలు నిర్వహిస్తామన్నారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాలను అంచనా వేసి స్క్రీనింగ్ కమిటీకి నివేదిక అందజేస్తామన్నారు. స్క్కీనింగ్ కమిటీ తర్వాత కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతామని వివరించారు.

పీసీసీ అధ్యక్షుడు అయినా, సీఎల్పీ నేతైనా, ఎవరైనా సరే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. మీడియాలో అభ్యర్థులు ఖరారు అని వచ్చే వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఈనెల 25 తర్వాత ఎవరైనా పార్టీలో చేరి టిక్కెట్ అడిగితే పీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ వెల్లడించారు. దరఖాస్తు స్వీకరణపై సబ్ కమిటీ ఏర్పాటు చేశామని.. సబ్ కమిటి చైర్మన్‌గా దామోదర రాజనర్సింహా, సభ్యులుగా రోహిత్ చౌదరి, మహేష్ గౌడ్ ఉన్నారని పేర్కొన్నారు.

publive-image

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి మొదలైంది. తమకే టికెట్లు కేటాయించాలని అభ్యర్థులు బలప్రదర్శనకు దిగుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లోకి చేరికలు జోరందుకున్నాయి. దీంతో సీట్ల కోసం పోటీ పెరిగింది. తమకే సీటు అంటూ స్థానిక నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. తొలి నుంచి పార్టీనే నమ్ముకున్న తమకు కాకుండా కొత్తగా చేరేవారికి టికెట్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ ఎవరికి సీటు ఇచ్చేది డిసైడ్ చేసేది హైకమాండ్ అని సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ విభేదాలకు చెక్ పెట్టేందుకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అందుబాటులోకి తెచ్చామని చెబుతున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe