Chandrababu: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రేపు చంద్రబాబు-భువనేశ్వరిల పెళ్లి రోజు కాగా.. ఇవాళ చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దివంగత సీఎం, నటరత్న నందమూరి తారకరామారావు.. కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబుకు ఇచ్చి 1981 సెప్టెంబర్ 10న వివాహం చేశారు. చెన్నైలోని మౌంట్ రోడ్డులో వీరి వివాహం జరిగింది. పెళ్లి జరిగే నాటికే చంద్రబాబు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏపీ సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు, పురావస్తు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు పనితనం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్.. తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయించారు. వీరికి పెళ్లి అయిన ఒకటిన్నర సంవత్సరానికి 1983లో లోకేష్ జన్మించారు.
రేపటితో 42 వసంతాలు పూర్తి..
రేపటితో(సెప్టెంబర్ 10)చంద్రబాబు, భువనేశ్వరిల వివాహం జరిగి 42 సంవత్సరాలు పూర్తికానున్నాయి. ఇన్నేళ్ల వైవాహిక జీవింతో వీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఓవైపు చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉంటే.. మరోవైపు హెరిటేజ్ డైరీని విజయవంతంగా నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలను భువనేశ్వరి చూసుకునేవారు.
విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి..
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారావారి పల్లెలోని ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో చంద్రబాబు.. విద్యార్ది సంఘం నాయకుడిగా పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభ్యుడిగా గెలిచిన తొలిసారే మంత్రి అయ్యారు. అనంతరం తన మామ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎమ్మెల్యే.. మంత్రి.. ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష నేతగా 45 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా దేశ రాజకీయాల్లో ప్రముఖ నాయకుడిగా ఉన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడిగా రికార్డు సృష్టించారు. రేపు పెళ్లి రోజు కాగా.. ఇవాళ చంద్రబాబు అరెస్ట్ కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: చంద్రబాబును రక్షించమని అమ్మవారిని కోరుకున్నా: భువనేశ్వరి