Nagarjuna: నాగార్జున ఒంటరి.. టాలీవుడ్ కింగ్ ను పట్టించుకోని ఇండస్ట్రీ!

తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున ఒంటరి అయ్యారా? ఎన్-కన్వెన్షన్ కూల్చివేతపై చిన్న ఆర్టిస్టుల దగ్గరి నుంచి అగ్రహీరోల వరకు ఎందుకు నోరు విప్పడం లేదు? కనీసం సోషల్ మీడియాలోనూ ఎందుకు స్పందించడం లేదు? ఈ అంశాలపై RTV స్పెషల్ స్టోరీ..

Nagarjuna: నాగార్జున ఒంటరి.. టాలీవుడ్ కింగ్ ను పట్టించుకోని ఇండస్ట్రీ!
New Update

హీరో నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ సెంటర్ ను ఇటీవల హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే.. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, నిబంధనల ప్రకారమే నిర్మాణాలు జరిగాయని నాగార్జున సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రభుత్వం మాత్రం ఇది ముమ్మాటికీ అక్రమ కట్టడమే అని స్పష్టం చేస్తోంది. హైడ్రా చీఫ్‌ రంగనాథ్ సైతం ఎన్-కన్వెన్షన్ ఆక్రమించిన స్థలంలోనే నిర్మించారని, నిబంధనలు పాటించలేదని తేల్చిచెప్పారు. అయితే.. మార్కెట్ ధర ప్రకారం ఎన్-కన్వెన్షన్ విలువ దాదాపు రూ.400 కోట్లకు పైగానే అన్న చర్చ జరుగుతోంది. ఇక్కడ జరిగే వివిధ కార్యక్రమాల ద్వారా నాగార్జున ఏడాదికి కనీసం రూ.100 కోట్ల ఆదాయం పొందుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

నాగార్జునపై ప్రభుత్వంతో పాటు.. వివిధ పార్టీలు, సంఘాల నేతలు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అయితే.. ఓ అడుగు ముందుకేసి నాటి మంత్రి కేటీఆర్ అండదండంలతోనే నాగార్జున ఈ అక్రమానికి పాల్పడ్డాడని ఫైర్ అయ్యారు. చెరువును ఆక్రమించి కోట్లు దండుకున్న నాగార్జున.. నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన పిల్లలకు ఏనాడైనా ఆదుకున్నాడా? అంటూ ధ్వజమెత్తారు. సీపీఐ నారాయణ సైతం స్వయంగా ఎన్-కన్వెన్షన్ వద్దకు వెళ్లి హల్ చల్ చేశారు. పక్కాగా ఇది ఆక్రమించిన స్థలంలో నిర్మించిందే అంటూ ఆరోపించారు. పక్కనే ఉన్న చెరువును పరిశీలిస్తే ఇది స్పష్టం అవుతోందన్నారు.


ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో నాగార్జునకు టాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా బహిరంగంగా మద్దతు తెలపలేదు. ప్రభుత్వం తీరును ఖండించలేదు. దీంతో ఈ విషయంలో నాగార్జున ఒంటరి అయ్యాడన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. కనీసం 'మా' కూడా ఈ విషయంపై ఇంతవరకు నోరెత్తకపోవడం చర్చనీయాంశమైంది. నాగార్జున నిజంగా చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టాడని ఇండస్ట్రీ పెద్దలు నమ్ముతున్నారా? లేక ఈ విషయంలో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి వివాదాస్పదం కావడం ఎందుకనే ఆలోచనతోనే సైలెంట్ గా ఉంటున్నారా? అన్న చర్చ కూడా ఉంది.

అయితే.. నాగార్జున ఫ్యాన్స్ మాత్రం ఇండస్ట్రీ పెద్దలు ఎన్-కన్వెన్షన్ విషయంలో నోరు విప్పకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని కుటుంబం ఏళ్లుగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉందని గుర్తు చేస్తున్నారు. నాగార్జున MAAకు గతంలో అధ్యక్షుడిగా సైతం పని చేశాడని.. ఆయనకు అండగా నిలబడడం కనీస బాధ్యత అని అంటున్నారు. కల్కి సినిమాలో ప్రభాస్‌ జోకర్‌ అంటూ నార్త్‌ ఇండస్ట్రీ ట్రోలింగ్ చేస్తే అక్కినేని వారసుడు, నాగార్జున కుమారుడు నాగచైతన్య స్పందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే అక్కినేని ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రం టాలీవుడ్ పెద్దలు స్పందించకపోడంపై సరికాదని వాపోతున్నారు.

అయితే.. నాగార్జున సినిమాలతో పాటు వ్యాపారాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఇండస్ట్రీకి సంబంధించిన అంశం కాదని.. ఆయన వ్యాపారాలకు సంబంధించినదని కొందరు సినీ పెద్దలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ విషయంపై ఇండస్ట్రీ నుంచి ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదని వారు వాదిస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe