Pawan Kalyan Birthday : “ఒక్కడినే… ఒక్కడినే… ఎంతదూరం వెళ్ళాలన్న ముందడుగు ఒక్కటే! ఎంతమంది మోసే చరిత్రైనా రాసేది ఒక్కడే! ఎక్కడికైనా వస్తా.. జనంలో ఉంటా.. జనంలా ఉంటా…” ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ సూపర్ హిట్ డైలాగ్. సరిగ్గా అలాగే.. ఒక్కడిగానే రాజకీయ పార్టీ పెట్టాడు. ఓటమి వచ్చినపుడు కుంగిపోలేదు.. ప్రత్యర్థుల తిట్లు.. శాపనార్ధాలు విని జంకిపోలేదు.. జనం కోసం నిలబడ్డాడు.. అందుకోసం వేశాడు ఒక్క ముందడుగు. అవసరమైన చోట తగ్గాడు.. తప్పదనుకున్న చోట తోలు తీస్తా అంటూ ఉరిమాడు. రాజకీయ నేపధ్యం లేదు.. సినిమాల్లో దశాబ్దాల జర్నీ లేదు.. కానీ, జనం కోసం నేను అంటూ రాజకీయ రంగంలో ఒక్కడిగానే అడుగులు వేశాడు. జనం కోసం ఎక్కడికైనా వెళ్లాడు. జనంతోనే ఉన్నాడు. తానే ఓ ప్రభంజనమై సరికొత్త చరిత్ర సృష్టించాడు.
పూర్తిగా చదవండి..పవన్ కళ్యాణ్.. పదేళ్ల క్రితం ఇదే పేరు రాజకీయాల్లో వినిపించినపుడు.. చాలా విమర్శలు. ఎంతోమంది ఎద్దేవా చేశారు. హీనంగా మాట్లాడారు. జనసేన అంటే పుట్టి.. గిట్టిన ఎన్నో పార్టీల లిస్టులోకి మరోటి వస్తోందంటూ గేలి చేశారు. మొదటిసారి పార్టీ పెట్టిన వెంటనే వచ్చిన ఎన్నికల్లో పోటీ చేయకుండా.. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినపుడు టీడీపీ తోక పార్టీ అని హేళన చేశారు. పవన్ కళ్యాణ్ మాట తీరు చూసి రాజకీయాల్లో సినిమా డైలాగులు పనిచేయవు అంటూ మాటల దాడి చేశారు. తరువాత ఐదేళ్లకు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి ఒంటరిగా అన్ని స్థానాలకూ పోటీ పడ్డాడు పవన్ కళ్యాణ్. అప్పుడు మూడు పెళ్లిళ్లు అంటూ వ్యక్తిత్వ హననం చేశారు. ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ ను నిలువరించడానికి ఎన్ని రాజకీయాలు చేయాలో అన్నీ చేశారు. చివరికి పవన్ నిలబడిన రెండు స్థానాల్లోనూ ఓటమి చెందేంతగా నిలువరించారు ప్రత్యర్ధులు. ఆ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ని.. జనసేన పార్టీని టార్గెట్ చేసి హేళన చేశారు. మరెవరైనా అయితే, ఆ అవమానానికి ఏమి చేసేవారో ఏమో కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం జన క్షేత్రంలోకి వచ్చేశారు. ఓటమికి ఎవరినీ నిందించలేదు. కానీ, తరువాత గెలుపు కోసం ఏం చేయాలో ఆలోచించారు. గెలుపు కోసం వేట మొదలు పెట్టారు.
భరించాడు.. భరించి నిలిచాడు..
Pawan Kalyan Birthday: “కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చు కాని… రావడం మాత్రం పక్కా..” అంటూ ఐదేళ్ల పాటు ప్రజల మధ్యన ఉంటూ.. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. వారి పక్షాన పోరాటాలు చేస్తూ గడిపారు. ఈ క్రమంలో అధికార వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై చేయని విమర్శలు లేవు. దత్తపుత్రుడన్నారు.. టీడీపీకి అమ్ముడు పోయాడని చెప్పారు.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ వాడకూడని పదజాలంతో రెచ్చిపోయారు. అన్నిటినీ భరించారు పవన్ కళ్యాణ్. తనపై వచ్చిన విమర్శలకు అప్పుడప్పుడు కొంచెం గట్టిగా సమాధానం చెబుతూ.. ఎక్కువగా ప్రజల ముందు తలవంచుకుని తన పని తాను చేసుకుంటూ పోయారు. అధికార వైసీపీ చేస్తున్న తప్పిదాలను ప్రజల ముందు పెట్టి జనసేనను ముందుకు తీసుకుపోయారు. ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీతో సయోధ్య పెంచుకున్నారు. ఎంతలా అంటే, ప్రధాని మోదీ చేయిపట్టి తన పక్కన కూచోపెట్టుకునేంతగా పవన్ కళ్యాణ్ ఎదిగిపోయారు. (ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.. ప్రధాని మోదీ అప్పట్లో చంద్రబాబును ఏ మాత్రం దగ్గరకు రానిచ్చేవారు కాదు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా చాలాసార్లు ప్రధాని అపాయింట్మెంట్ దొరకక ఢిల్లీ నుంచి ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి) తన ప్రసంగాల్లో ప్రధాని మోదీతో తన అనుబంధం గురించి పవన్ చెప్పినపుడల్లా వైసీపీ నుంచి వ్యంగ్యాస్త్రాలు వచ్చి పడిపోయేవి. వాటినన్నిటినీ లెక్కరాసుకుంటూ ప్రజల మధ్య.. ప్రజల కోసం ముందుకు సాగరు పవన్ కళ్యాణ్. కొందరు వైసీపీ నాయకుల బూతు పురాణాన్ని భరించారు. భరిస్తూ.. భరిస్తూ సమయం కోసం వేచి చూశారు.
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ ఎంత తగ్గాలో తెలియాలి..
Pawan Kalyan Birthday: “యుద్ధంలో గెలవడమంటే శత్రువుని చంపడం కాదు.. శత్రువుని ఓడించడం.. శత్రువుని ఓడించటమే యుద్ధం ఒకే ఒక్క లక్ష్యం” అని చెబుతూ.. 2024 ఎన్నికల బరిలోకి దిగారు. అయితే, ఈసారి అటు బీజేపీ.. ఇటు తెలుగుదేశం పార్టీలతో కలిసి కూటమిగా యుద్ధానికి సైన్యాధ్యక్షుడి మాదిరిగా.. యుద్ధ తంత్రానికి మహామంత్రిలా పనిచేశారు. ఎడమొఖం.. పెడమొఖంగా ఉండే బీజేపీ-టీడీపీ పెద్దలను ఒక్కతాటిపైకి తెచ్చారు. శత్రువుని ఓడించడానికి తన వాళ్లకు దూరం అయ్యారు. అయినా సరే అందరినీ కలిపారు. పొత్తులు కుదిరాయి. సీట్ల పంపకాలు వచ్చాయి.. జనసేన పార్టీలో అందరూ కనీసం 50 స్థానాలన్నా పవన్ కళ్యాణ్ తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అసలు పొత్తు లేకుండా పోటీ చేస్తే పవన్ ముఖ్యమంత్రి అయిపోతారు అంటూ ఒత్తిడి తెచ్చారు. అయినాసరే.. కేవలం 23 స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకరించారు. ఇది తెలిసిన వెంటనే జనసేనలో నాయకులుగా చెలామణీ అయిన వారిలో చాలామంది కోపగించారు.. కొంతమంది పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు రావంటూ పార్టీని వదిలి పోయారు. ప్రత్యర్ధులు అంటే వైసీపీ నేతలైతే పొత్తు కుదరదని అన్నారు. కుదిరిన తరువాత జనసేన కార్యకర్తల భుజాల మీద చంద్రబాబును మోస్తున్నారని చెప్పారు. సీట్ల విషయంలో తగ్గినపుడు.. పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడని విమర్సించారు. కొందరు వైసీపీ నేతల విమర్శలు అంటే దాదాపు బూతులే కదా.. ఆ తరువాత బీజేపీ కోసం తన కోటాలోని మరో రెండు సీట్లు కూడా వదిలేసుకున్నారు పవన్ కళ్యాణ్. దీంతో ఆయన మీద ఇంటా..బయటా విపరీతమైన ఆరోపణలు. చాలామంది జనసేనను వదిలి దూరం జరిగారు. అయినా పవన్ తగ్గలేదు. ఇక కొందరు వైసీపీ ప్రముఖ నేతలైతే పవన్ ఛరిష్మానే ఎగతాళి చేస్తూ.. “మనిద్దరం కలిసి రోడ్డు మీద నిలబడదాం.. నాకోసం ఎంతమంది వస్తారో.. నీకోసం ఎంతమంది వస్తారో చూసుకుందాం” అంటూ ఛాలెంజ్ చేశారు. అయినా.. పవన్ కళ్యాణ్ అదరలేదు. వారి తిట్ల దండకాన్నే తన విజయానికి రహదారిగా చేసుకున్నారు. “భయమున్నోడు అరుస్తాడు.. బలమున్నోడు భరిస్తాడు” అంటూ ఎన్నికల యుద్ధంలో పోరాటం చేశారు. కట్ చేస్తే..
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా..
Pawan Kalyan Birthday: ఇక పవన్ పిఠాపురం నుంచి పోటీచేశారు. అక్కడ ఆయనను ఎలాగైనా ఓడించాలి.. పవన్ కళ్యాణ్ ‘అసెంబ్లీ కాదు కదా అసెంబ్లీ గేటును కూడా తాకకుండా చేస్తాం’ అంటూ వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. అందుకోసమే సర్వశక్తులూ ఒడ్డారు. ఆఖరుకు ప్రచారం చివరి ఘట్టంలో అక్కడ పవన్ ప్రత్యర్థిగా బరిలో ఉన్న వంగా గీతను డిప్యూటీ సీఎంను చేస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు. అయినా, పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకడం కాదు.. తన్నుకుంటూ వెళ్లేలా పెద్ద మెజార్టీతో గెలిపించుకున్నారు. అక్కడి ప్రజల అభిమానం ఎలాంటిదిగా అంటే.. ఎన్నికల ఫలితాలు రాకుండానే, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ వెహికిల్స్ పై స్టిక్కర్స్ అంటించుకుని తిరిగారు.
ఇప్పుడు చెప్పుకున్నదంతా అందరికీ తెలిసిందే. కాకపోతే, ఈరోజు (సెప్టెంబర్ 2) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తానం చెప్పుకోవడంతో పాటు అధికారంలోకి వచ్చాకా ఆయన వ్యవహారశైలి గురించి కూడా రెండుముక్కలు చెప్పుకోవడం సముచితం కాబట్టి ఇదంతా చెప్పాల్సి వచ్చింది.
రూల్ మారింది.. ఆయన పద్ధతి ఇంకా మారింది..
Pawan Kalyan Birthday: “నేనొచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి.. టైం మారాలి, టైం టేబుల్ మారాలి.. మారకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా..” ఇది పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్. అందుకు తగ్గట్టుగానే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాకా రూల్స్ మారాయి. అంతకు ముందు ఉన్న పద్ధతులూ మారాయి. అన్నిటికన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యవహారశైలీ మారిపోయింది. మౌన మునిలా.. కొత్తగా అప్పుడే కాలేజీలోకి అడుగుపెట్టిన విద్యార్థిలా.. అన్నిటికీ మించి ఎదిగిన కొద్దీ ఒదగడం అంటే ఏమిటో తెలియచెప్పేలా పవన్ మారిపోయారు. తన మీద నోరు పారేసుకున్న నాయకులను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకా కొంతమంది నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతోన్నా మౌనంగానే అన్నీ వింటున్నారు. ఎవ్వరినీ విమర్శించడం చేయడం లేదు. తన వ్యవహారశైలితో చాలామంది రాజకీయ నాయకులకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆదర్శంగా మారారు. అధికారం కోసం చేసిన పోరాటంలో ఎక్కడ నెగ్గడమో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలని నేర్పిన పవన్ కళ్యాణ్. అధికారంలోకి వచ్చాకా “పాపులారిటదేముంది.. అది పాసింగ్ క్లౌడ్ లాంటిది.. వాతావరణం వేడిక్కితే వానై కరిగిపోతుంది. నేను ఆకాశం లాంటోడిని.. ఉరుమొచ్చిన, పిడుగొచ్చినా & మెరుపొచ్చినా.. నేను ఎప్పుడు ఒకేలా ఉంటాను” అనేలా నిలిచారు. “నాకు నేను పోటీ, నాతో నేనే పోటీ” అన్నట్టుగా రాజకీయాల్లో ఎదిగి ఒదిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక్కడు కానే కాదు.