తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ గా ఎంపికయ్యారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ చైర్మన్ పదవి రాదని పేర్కొన్నారు. ఈ పదవి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. వెంకటేశ్వర స్వామి కృప, ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతోనే తనకు ఈ అవకాశం దక్కిందని చెప్పారు. గతంలో ఏ విధంగా పని చేశామో.. అంతకు మించిన విధంగా సామాన్య భక్తుల కోసం పని చేస్తామని భూమాన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
రెండోసారి వేంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తమ అధినేత జగన్ ఇచ్చిన ఈ అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకుంటానన్నారు. గతంలో లాగా హిందు ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. 15 సంవత్సరాల తరువాత తనకు మళ్లీ టీటీడీ ఛైర్మన్ పదవి దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు.
జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి హాయంలో చైర్మన్ గా పనిచేశానని, ఇప్పుడు తనయుడు హాయంలో చైర్మన్ గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇది కూడా వెంకన్న ఆశీస్సులతో లభించిందని భావిస్తున్నానని చెప్పారు. తండ్రి దగ్గర, కొడుకు దగ్గర పనిచేసే అవకాశం.. బహుశా ఇంకెవరికీ రాకపోయి ఉండొచ్చని చెప్పుకొచ్చారు.
కాగా ప్రస్తుత టీటీడీ పాలక మండలి గడువు ఆగష్టు 8వ తేదీ ముగుస్తున్నందున, కొత్త పాలక మండలిని నియమించాల్సి ఉందని పేర్కొంటూ తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్ విడుదల చేసింది. టీటీడీ ట్రస్టు బోర్డు చైర్మన్ గా ఆయన నియామకం తర్వాత సభ్యుల నియామకం కూడా చేపడతామని ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఆగష్టు 8న ప్రస్తుత బోర్డు పదవీకాలం ముగిసిన అనంతరం కొత్త పాలకమండలి చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి నియామకం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
అయితే వాస్తవానికి రెండేళ్ల క్రితమే టీటీడీకి కొత్త చైర్మన్ ని నియమించాల్సి ఉందిది. కానీ వైవీ సుబ్బారెడ్డికే రెండో సారి చైర్మన్ గా అవకాశం కల్పించారు సీఎం జగన్. టీటీడీ చైర్మన్ రేసులో ఈసారి కూడా చాలా పేర్లు వినిపించాయి. అయితే ముఖ్యమంత్రి మాత్రం కరుణాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. రాబోయే బ్రహ్మోత్సవాలు ఆయన హయాంలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.