Tirumala బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి వాహనాలు విశిష్టతలు!

ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది అధిక మాసం రావడం వల్ల ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ బోర్డు నిర్ణయించింది.

New Update
Tirumala బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి వాహనాలు విశిష్టతలు!

ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది అధిక మాసం రావడం వల్ల ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ బోర్డు నిర్ణయించింది. అందులో భాగంగానే స్వామివారికి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 18 నుంచి నిర్వహిస్తున్నారు.

అయితే బ్రహ్మోత్సవాలు గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని కొన్ని ప్రత్యేక వాహనాల మీద ఊరేగిస్తారు. ఆయన వాహనాలు ఏంటి..వాటి విశిష్టతలు ఏంటి అనేది తెలుసుకుందాం..స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శేష వాహనం మీద ఊరేగిస్తారు.

శేష వాహనం: స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని అలంకరించి పెద్ద శేష వాహనం పై ఊరేగిస్తారు. తిరుమల స్వామి వారు ఉండే కొండ పేరు శేషాద్రి. అందుకే స్వామి వారిని ముందుగా ఏడు తలలు ఉన్న పెద్ద శేష వాహనం పై ఊరేగిస్తారు.

సింహా వాహనం: బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని మూడో రోజు సింహా వాహన సేవ నిర్వహిస్తారు. ఆ సమయంలో స్వామి వారిని సర్వ అలంకర భూషితుడిగా అలంకరిస్తారు. జంతువులకు, అడవికి రాజు అవ్వడంతో మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతి మనిషి కూడా తనలోని మృగత్వాన్ని పూర్తిగా అణచి వేయాలనే ముఖ్య ఉద్దేశంతో స్వామి వారిని ఈ సింహా వాహనం పై ఊరేగిస్తుంటారు.

కల్ప వృక్ష వాహనం: ఇక నాల్గవ రోజు స్వామి వారిని కల్ప వృక్ష వాహనం పై స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారు. మన పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ కల్ప వృక్షానికి ప్రత్యేక స్థానం ఉంది. కల్ప వృక్షం అంటే బంగారంగా కొలుస్తారు. అందుకే ఈ వాహనం మీద స్వామి వారిని దర్శించుకున్న వారందరి కొంగు బంగారు అవుతుందని స్వామి వారిని ఆ వాహనం మీద ఊరేగిస్తారు.

స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజున స్వామి వారు భక్తులకు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అయితే ఈ అవతారానికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే..అన్ని వాహన సేవలు స్వామి వారి ఆలయంలోని మండపంలో ప్రారంభం అయితే..మోహినీ అవతార ఊరేగింపు మాత్రం స్వామి వారు ఆలయం నుంచే పల్లకి పై ప్రారంభం అవుతుంది. ఈ అవతారంలో స్వామి వారు తన కుడి చేతిలో చిలుకను పట్టుకుని ఉంటారు. గోదా దేవి ఇచ్చినట్లుగా చెప్తారు.

ఇక ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే అత్యంత విశిష్టత ఉన్న వాహన సేవ ఏదైనా ఉంది అంటే..అది గరుడ వాహన సేవ.ఎందుకంటే స్వామి వారికి ప్రధాన వాహనం గరుత్మాంతుడు. అందుకే ఆయన్నే స్వామి వారికి ప్రధాన , ప్రథమ భక్తునిగా భక్తులు భావిస్తారు. ఈ సేవలో స్వామి వారికి ప్రత్యేకంగా ప్రభుత్వం తరుఫు నుంచి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

గజ వాహనం: ఆరో రోజు రాత్రి స్వామి వారిని గజ వాహనం మీద తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. దీనిని చూసిన భక్తులు ఆనందంతో పొంగిపోతారు. గజేంద్ర మోక్షాన్ని తలపించే విధంగా ఈ ఊరేగింపు కొనసాగుతుంది. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకోవడానికి ఎప్పుడూ భగవంతుడు సిద్ధంగా ఉంటాడని తెలియజేయడానికే ఈ వాహన సేవ నిర్వహిస్తుంటారు.

సూర్య ప్రభ వాహనం: ఏడోరోజు ఉదయం స్వామి వారిని సూర్య ప్రభ వాహనంలో ఊరేగిస్తారు. స్వామి వారి రథ సారథి అనూరుడు ఆరోజు ఆదిత్య రూపంలో స్వామి వారి రథానికి సారథ్యం వహిస్తాడు. అదే రోజు సాయంత్రం చంద్ర ప్రభ వాహనం మీద స్వామి రావడంతో భక్తులకు దివారాత్రులకు అధినేతను తానే అని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు.

రథోత్సవం: ఎనిమిదో రోజు రథోత్సవం జరుగుతుంది. రథోత్సవం రోజున వచ్చినంత మంది భక్తులు ఇంకా ఏరోజున కూడా అంతమంది భక్తులు రారు. భక్తులు ఈ స్వామి సేవలో భక్తులు నేరుగా పాల్గొనే అవకాశం ఉంది.

చక్రస్నానం: బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు అంటే తొమ్మిదవ రోజు స్వామివారికి చక్రత్తాళ్వార్‌ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. ముందుగా వరాహస్వామి ఆలయ ఆవరణంలో స్వామి వారితో పాటు శ్రీదేవి, భూదేవిలకు కూడా కలిపి అభిషేక సేవలు జరిపిస్తారు. ఆ తరువాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్య స్నానాలు చేయిస్తారు. దీనినే చక్రస్నాన ఉత్సవం అంటారు. ఇది జరుగుతున్న సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.

స్వామి వారికి చక్రస్నానాలు అయిన తరువాత ఆరోజు సాయంత్రమే శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని కిందకు దించుతారు. దీంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలికినట్లు. బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పూర్తి అయినట్లు.

Advertisment
తాజా కథనాలు