TTD Brahmotsavalu updates: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Brahmotsavalu) సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సెప్టెంబరు 22న గరుడసేవకు విశేషంగా విచ్చేసే భక్తులందరూ సంతృప్తికరంగా వాహనసేవను దర్శించుకునేలా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈవో అధికారులతో కలిసి పరిశీలించారు.
జగన్ వస్తున్నారు:
బ్రహ్మోత్సవాల మొదటిరోజైన సెప్టెంబరు 18న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు. గరుడసేవ నాడు దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారని చెప్పారు. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతిస్తామన్నారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్థరాత్రి 2 గంటల వరుకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతామని తెలియజేశారు. బయట వేచి ఉండే భక్తులు తమ వంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండి భద్రతా విభాగం నిబంధనలు పాటించాలని చెప్పారు. అందరికీ గరుడసేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు దర్శనం, బస, భద్రత, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు చెప్పారు. భద్రతాచర్యలపై ఇదివరకే సివిఎస్వో, తిరుపతి ఎస్పీ సమీక్ష నిర్వహించారని, ఇంజినీరింగ్ అధికారులు వీరికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు.
కీలక సూచనలు చేసిన ఈవో:
ముందుగా శ్రీవారి ఆలయం నుండి వాహన మండపం, మాడ వీధులు, బేడి ఆంజనేయస్వామివారి ఆలయం, సుపథం, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 తదితర ప్రాంతాలను ఈవో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మరోవైపు తిరుపతిలో శ్రీనివాస సేతు ప్రారంభానికి సిద్దమైంది. సీఎం చేతుల మీదగా 18న ప్రారంభించనున్నారు. శర వేగంగా తుది దశ పనులు జరుగుతున్నాయి. దీంతో శ్రీవారి భక్తులకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!
ALSO READ: శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం