AP Politics: సోమవారం ఒకే రోజు వ్యవధిలో జరిగిన వరుస పరిణామాలు వైసీపీలో ప్రకంపనలు సృష్టించాయి. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటపడుతుండడం పార్టీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయమవుతోంది. ముఖ్య నేతల కార్యాచరణపై వెలువడుతున్న లీకులు, రూమర్లు కూడా కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: 11 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ల మార్పు.. వైసీపీ సంచలన నిర్ణయం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ను మంగళగిరిలో ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరాజయంలో కీలక పాత్ర పోషించిన గాజువాక ఎమ్మెల్యే తనయుడు, నియోజకవర్గ ఇన్చార్జి దేవన్ రెడ్డి వరుస రాజీనామాలు పార్టీకి గట్టి షాకిచ్చాయనే చెప్పాలి. దీనికితోడు మరో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాజీనామా వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే, ఆయన స్వయంగా దీన్ని ఖండిస్తూ గిట్టని వారు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ప్రకటన విడుదల చేశారు. అయితే, ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవన్ రెడ్డి బాటలోనే మరికొందరు కీలక నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మైలవరం ఎమ్మెల్యే రాజీనామాపై రూమర్లు వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: గాజువాక ఇన్చార్జిగా అమర్నాథ్?.. మంగళగిరికి గంజి చిరంజీవి!
ఇదిలా ఉండగా, 11మంది సిట్టింగ్ లకు స్థానచలనంతో పాటు నియోజకవర్గ ఇన్చార్జులను మారుస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన పార్టీలో అంతర్గతంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా ఉందని, అందులో భాగంగానే సిట్టింగుల మార్పు సహా గెలుపే లక్ష్యంగా వ్యూహాలను వైసీపీ రూపొందిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
అయితే, 24గంటల వ్యవధిలో పార్టీలో జరిగిన పరిణామాలపై పైకి గుంబనంగా కనిపిస్తున్నప్పటికీ వైసీపీ అధిష్టానం దీనిపై తీవ్రంగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన స్వల్ప వ్యవధిలోనే మంగళగిరి ఇన్చార్జిగా గంజి చిరంజీవి నియామకం, గాజువాక ఇన్చార్జిగా మంత్రి అమర్నాథ్ నియామకంపై పరిశీలనలు.. ఆయా అంశాలపై పార్టీ ఎంతలా ఫోకస్ చేసిందో వెల్లడిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మున్ముందు పార్టీలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి.. పార్టీ అధిష్టానం ఎలాంటి వ్యూహాలు అవలంభించబోతున్నదన్న అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.