Violence in Manipur : మణిపూర్(Manipur) లోని చురచంద్‌పూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఎస్పీ, డిప్యూటీ కమిషనర్ (డీసీ) కార్యాలయాలున్న ప్రభుత్వ ప్రాంగణంలోకి సుమారు 400 మంది గుంపు ప్రవేశించి వాహనాలకు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. వీడియోలో సాయుధులతో కనిపించినందుకు జిల్లా పోలీసు హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది.
ముగ్గురు మృతి:
హెడ్ కానిస్టేబుల్ సిమ్లాల్ పాల్(Simlalpal) సస్పెన్షన్ ను నిరసిస్తూ, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుకీ వర్గానికి చెందిన 400 మందికి పైగా ఆందోళనకు దిగారు. కార్యాలయాన్ని ముట్టడించారు. అలాగే, ఎస్పీ కార్యాలయం వెలుపల నిలిపి ఉంచిన వాహనాలకు నిప్పుపెట్టారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు, అస్సాం రాష్ట్రీయ రైఫిల్స్ లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగించాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. హింస పెరిగే అవకాశం ఉండడంతో సర్చంద్ పూర్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
చురాచంద్ పూర్ ఎస్పీ శివానంద్ సుర్వే, హెడ్ కానిస్టేబుల్ సియామ్ లాల్ పాల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం మణిపూర్‌లో హింసకు కారణమైంది. చురాచంద్ పూర్ జిల్లా(Churachandpur District) పోలీసులకు చెందిన సియామ్ లాల్ పాల్ పై శాఖాపరమైన విచారణ కూడా పరిశీలనలో ఉంది. గతేడాది(2023) మే 3న మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండలో దాదాపు 190 మంది చనిపోయారు. హింసాత్మక ఘర్షణల్లో వందలాది మంది గాయపడ్డారు. హింసను చెలరేగకుండా మణిపూర్‌లో మొబైల్ ఇంటర్నెట్‌ను నిషేధించారు. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే చిత్రాలు, పోస్టులు, వీడియో సందేశాల ప్రసారానికి కొన్ని సంఘ విద్రోహ శక్తులు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకునే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇది మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని మణిపూర్ ప్రభుత్వం సంయుక్త కార్యదర్శి (హోం) జారీ చేసిన నోటీసులో పేర్కొంది.
Also Read: వివాహ సమానత్వానికి పెద్దపీట.. చారిత్రాత్మక బిల్లుకు క్రిస్టియన్ కంట్రీ ఆమోదం!