ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సీనియర్ రాజకీయ నాయకుల్లో తోట నరసింహం ఒకరు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి మంత్రిగా, మరోసారి ఎంపీగా పనిచేశారు. కాపు సామాజిక వర్గంలో మంచి పట్టున్న నాయకుడు. తన అన్న తోట వెంకటాచలం రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. తోట వెంకటాచలం 1991 ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి తెలుగుదేశం అభ్యర్థి జ్యోతుల వెంకట అప్పారావు అలియాస్ నెహ్రూపై పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 1994,1999 ఎన్నికల్లో జోతుల నెహ్రూ చేతిలో వరుసగా ఓడిపోయారు. 2003లో వెంకటాచలం ఆకస్మాత్తుగా కన్నుమూశారు.
ఆ సమయంలో వేర్‌హౌస్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న తోట నరసింహం.. 2004 ఎన్నికల్లో ఉద్యోగం వదిలి అన్న తోట వెంకటాచలం వారసుడిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి నెహ్రూపై గెలుపొందారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డితో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా, పీసీసీ ఉపాధ్యక్షుడుగానూ విధుల నిర్వర్తించారు. 2009 ఎన్నికల్లోనూ నెహ్రూపై రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైయస్ మరణానంతరం జరిగిన పరిణామాలతో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు.
రాష్ట్ర విభజన జరగడంతో 2014లో తెలుగుదేశంలో చేరి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌పై గెలుపొందారు. లోక్‌సభలో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ, రైల్వే స్టాండింగ్ కమిటీల్లో సభ్యునిగా ఉన్నారు. టీడీపీ లోక్‌సభాపక్ష నేతగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలోనుఏ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చారు. అయితే 2019లో వైసీపీలో చేరి పెద్దాపురం నుంచి తన భార్య తోట వాణిని ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. అయితే అనారోగ్య కారణంగా ఆయన ప్రచారానికి దూరంగా ఉండటంతో టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయ చినరాజప్ప చేతిలో ఆమె ఓడిపోయారు. ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి నరసింహం కుమారుడు తోట రాంజీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ప్రస్తుతం తోట నరసింహం అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో తన పాత నియోజకవర్గమైన జగ్గంపేటలో మళ్లీ కార్యక్రమాలు ప్రారంభించారు. తనయుడు రాజకీయ భవిష్యత్తు కోసం నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి తన కుమారుడిని పోటీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ నుంచి జగ్గంపేట ఎమ్మెల్యేగా జ్యోతుల చంటిబాబు వర్గీయులు నరసింహం రాకను జీర్ణించుకోలేకపోతున్నారు. తోట నరసింహానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్‌లు పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు ఆయన కూడా గట్టి కౌంటర్ ఇవ్వడంతో నియోజకవర్గం లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. తన కార్యకర్తలకు అండగా ఉండేందుకే ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నానని నరసింహం చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గెలుపు అవకాశాలు అంతంత మాత్రమే ఉన్నాయని సర్వేల్లో వెల్లడైందని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని అధిష్టానం భావిస్తుందని అందుకే నరసింహం కుటుంసభ్యులు తిరిగి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారనే అనుమానాలు వస్తున్నాయి. మొత్తానికి ఈ విభేదాలతో నియోజకవర్గం కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. మరి పార్టీ పెద్దలు ఎవరికి టికెట్ ఇస్తారో మరికొన్ని నెలలు వేచిచూడాలి.