క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ఎవరికైనా, ఏ వయసు వారికైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్ కారణంగా ప్రతి ఏటా మిలియన్ల మంది మరణిస్తున్నారు. ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మరణాల్లో క్యాన్సర్ రెండవ ప్రధాన కారణం.ఎలాంటి ప్రత్యేక కసరత్తులు చేయకుండానే 5 కేజీలకుపైగా బరువు తగ్గితే.. దాన్ని క్యాన్సర్‌కు తొలి సూచికగా భావించవచ్చని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ, మెడికల్ ఆంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ మీనూ వాలియా తెలిపారు. క్లోమం, ఆహార నాళం, ఉదర, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లలో ఇది ప్రాథమిక లక్షణమని ఆయన తెలిపారు. పేగుల్లో ఉండే కణుతుల కారణంగా కొద్ది మోతాదులో ఆహారం తీసుకోగానే కడుపు నిండినట్లు అవుతుందని ఆయన తెలిపారు.
పెద్ద పేగు క్యాన్సర్ కారణంగా మలబద్ధకం సమస్య తలెత్తుంది. వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే అందులో నుంచి బయటపడేందుకు 90 శాతానికపైగా అవకాశం ఉంది. అదే వ్యాధి ముదిరితే నయమయ్యే అవకాశాలు తగ్గిపోతాయి.రొమ్ము భాగంలో లేదా చంకల్లో చన్నుల కింది భాగంలో ఉబ్బినట్లుగా లేదా గడ్డలాగా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కండి. చనుమొనల నుంచి రక్తంతో కూడిన ఏవైనా స్రావాలు వస్తున్నట్లయితే రొమ్ములపై చర్మంలో ఏవైనా అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి.
శరీరంలో ఎక్కడైనా ఉబ్బినట్లుగా కనిపించినా.. వాటి ఆకారంలో, పరిమాణంలో మార్పు కనిపించినా ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు.కొన్నిసార్లు పొత్తికడుపులో అసాధరణ రీతిలో ద్రవాలు ఉత్పత్తి అవుతాయి. దీన్నే జలోదరం అంటారు. దీని వల్ల పొట్టభాగం ఉబ్బరంగా మారుతుంది. దీని వల్ల బరువు పెరగడంతోపాటు నడుము భాగం అసాధారణంగా పెరిగిపోతుంది. వీటి వల్ల కాలేయ సంబంధ వ్యాధులు వస్తాయి. ఈ పరిస్థితుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పేగుల్లో ఏదో అడ్డుపడుతున్నట్లు అనిపించి.. ఆహారం తీసకున్నప్పుడు నొప్పిగా అనిపించినా జాగ్రత్తపడాలి. ఇలాంటి సమయంలో నొప్పి క్రమక్రమంగా పెరుగుతుంటుంది.
శరీర భాగంలో ఎక్కడైనా నొప్పి విడవకుండా వస్తున్నా అది క్యాన్సరేమో అని అనుమానించాలి. అన్ని నొప్పులు క్యాన్సర్ కావు కానీ జగ్రత్త అవసరం. బోన్ క్యాన్సర్ లాంటి వ్యాధులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి కూడా చాలా రోజులపాటు వేధిస్తుంటే.. సొంత వైద్యంతో సరిపెట్టకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే అది బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు. పెద్ద పేగు, పురీషనాళ, అండాశయ క్యాన్సర్లు వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ వేధిస్తుంది.
కొందరికి నోట్లో ఎర్రటి లేదా తెల్లటి రంగులో పుళ్లు ఏర్పడుతుంటాయి. నాలుక లేదా టాన్సిల్స్ భాగంలో ఈ తరహా పుళ్లు ఏర్పడితే అవి ప్రాణాంతక ల్యూకోపాల్కియా లేదా ఎరిత్రోపాల్కియా లాంటి వ్యాధులు కావచ్చు. గొంతు బొంగురు పోవడం, మాట మారడం తదితర లక్షణాలు నాలుగు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే.. వెంటనే డాక్టర్ని కలవండి. పొగాకు, పాన్ నమిలే అలవాటు ఉన్న వాళ్లు నోరు తెరవడంలో ఇబ్బంది పడుతుంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది.