టొమాటోల్లో చాలా పోషకాలుంటాయి. వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు విటమిన్–సి, విటమిన్–కె, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని వేడి చేయడం ద్వారా పోషకాల శాతం చాలా వరకూ తగ్గిపోతుంది. అందుకే వీలున్నప్పుడల్లా టొమాటోలను పచ్చిగా తినడం అలవాటు చేసుకుంటే మరింత హెల్దీగా ఉండొచ్చు. క్యారెట్, బీట్‌రూట్‌లతో కూడా చాలామంది కూరలు చేసుకుంటుంటారు. అయితే వీటిని నేరుగా లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటేనే వాటిలో ఉండే విటమిన్–ఎ, విటమిన్–సీ, ఫైబర్, పొటాషియం మరింత ఎక్కువగా శరీరానికి అందే వీలుంటుంది.
ఎన్నోవిటమిన్స్, మినరల్స్ ఉండే బ్రొకలీని కూడా నేరుగా తీసుకుంటేనే మంచిదని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. బ్రోకలీని వండడం ద్వారా అందులో ఉండే సూక్ష్మ పోషకాలు చాలావరకూ నశించే అవకాశం ఉంది. దోసకాయలను కూడా నేరుగా తింటేనే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. దోసకాయల్లోని నీటిలో బోలెడు మినరల్స్ ఉంటాయి. వేడి చేయడం ద్వారా అవి చాలావరకూ నశించే అవకాశం ఉంటుంది. వంటల్లో వాడే ఉల్లిపాయలు, అల్లం వంటి వాటిని కూడా నేరుగా తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. పచ్చి ఉల్లిపాయల ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ నేరుగా శరీరానికి అందుతాయి. ఇకపోతే వంటల్లో వాడే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, వెల్లుల్లి లాంటివి కూడా నేరుగా తీసుకున్నప్పుడే వాటి ప్రయోజనం పూర్తిగా అందుతుంది. అలాగే రిచ్ ఫైబర్, ప్రొటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉండే నట్స్, కొబ్బరి, నువ్వుల వంటి వాటిని కూడా నానబెట్టి తీసుకోవడం ఉత్తమం. నట్స్‌ను వేగించి తీసుకోవడం ద్వారా వాటిలోని పోషకాలు తగ్గిపోతాయి.