రాజకీయాల్లో జంపింగ్స్ అనేవి కామన్. ఏ లీడర్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరూ చెప్పలేం. ఇవాళ బండబూతులు తిట్టుకున్న లీడర్లు.. రేపు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇప్పుడు శత్రువులా ఉన్న అవతలి పార్టీ కాసేపటికి అక్కున చేర్చుకునే దైవం మాదిరిగా కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల టైమ్ నడుస్తోంది. మరి.. అటు లీడర్లు ఇటు.. ఇటు లీడర్లు అటు మారడం చూస్తున్నాం. రానున్న రోజుల్లో ఇది తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
రేవంత్ రెడ్డిని నానా తిట్లు తిట్టి కాంగ్రెస్ ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లోకి రానున్నారని దాని సారాంశం. దీనికోసం తెర వెనుక చర్చలు కొనసాగుతున్నాయట. తమ్ముడి కోసం ప్రియాంక గాంధీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల తర్వాత రాజగోపాల్‌రెడ్డి ఆలోచనలో పడ్డారని.. సర్వేల్లోనూ బీజేపీకి థర్డ్ ప్లేస్ రావడంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం సాగుతోంది. పైగా, బీజేపీలో సరైన ప్రాధాన్యత లేదని ఆయన అసహనంలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగొచ్చెయ్ తమ్ముడూ.. అంటూ సోదరుడిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. పాదయాత్రలో రాజగోపాల్ రెడ్డితో భట్టి విక్రమార్క సైతం చర్చలు జరిపారని సమాచారం. 2022 ఆగస్ట్ 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక ఖాయమైంది. అయితే.. కమ్యూనిస్టుల అండగా ఈ సీటును కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.