Prakasam District: చేయని తప్పుకు పోలీసులు కొట్టారని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఈనెల 6న పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని అతడు నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన మోజెస్‌కు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
Also Read: నష్టపోయిన పొగాకు రైతుల రుణాలు మాఫీ చేయాలి.!
ఆస్పత్రిలో మోజెస్ చివరిగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. తనని చేయని తప్పుకు పోలీసులు దారుణంగా కొట్టి అవమానించారని బాధితుడు వాపోయాడు. అనంతరం మోజెస్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడు మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు, దళితులు తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వల్లే మోజెస్ చనిపోయాడని రోడ్డుపై ఆందోళన చేపట్టారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు నిజనిజాలు తెలుసుకోకుండా దారుణంగా ప్రవర్తించడంతోనే చనిపోయాడని నిప్పులు చెరుగుతున్నారు. పోలీస్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట మోజెస్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సీసీ టివిలో రికార్డ్ అయిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ఆత్మహత్య చేసుకునే ముందు మోజెస్ యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట తన శరీరంపై పెట్రోల్ పోసుకొని పోలీస్ స్టేషన్ లోపలికి రావడం సీసీటివి లో రికార్డ్ అయింది. అనంతరం పోలీస్ స్టేషన్ నుండి నిప్పంటించుకుని మంటలతో బయటకు రావడం రికార్డ్ అయింది. ఇది గమనించిన పోలీసులు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పీ అతనిని తీసుకెళ్లే దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.