మంత్రాలు చదువుతూ దేవుడి సేవలో తరించాల్సిన ఆలయ పూజారులు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అంతటితో ఆగకుండా నీ అంతుచూస్తామంటే, నీ అంతు చూస్తామంటూ వార్నింగ్ లు ఇచ్చుకున్నారు. నడీరోడ్డు మీద కొట్టుకుంటున్న ఆ పూజారులను చూసి అయ్యో దేవుడా అని ముక్కుమీద వేలేసుకోవటం అక్కడి వారి వంతయ్యింది. తమిళనాడులోని కాంచీపురంలో జరిగిందీ సంఘటన. కాంచీపురం వరదరాజ స్వామి ఆలయంలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి :Pro Kabaddi League : తొడగొట్టిన బాలకృష్ణ..19 నుంచి ప్రో కబడ్డీ లీగ్
కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రకు పూజారులు భారీగా తరలి వస్తారు. కాగా యాత్రలో మొదటి పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. శ్రీవైష్ణవ సంప్రదాయంలో వడగలై, థెన్‌కలై అనే రెండు వర్గాలు ఉన్నాయి. వరదరాజ స్వామి వారికి దివ్య ప్రబంధం పాడే విషయంలో ఈ రెండు వర్గాల స్వాముల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఒక వర్గానికి చెందిన స్వాములు మరో వర్గానికి చెందిన స్వాములపై దాడికి దిగారు. దీంతో.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్వామి ఊరేగింపును మధ్యలోనే ఆపేసి స్వాములు కొట్టుకోవడంతో భక్తులు షాక్ అయ్యారు.
దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి భక్తులు, అధికారులు, పోలీసులు కలగజేసుకుని.. వివాదాన్ని తాత్కాలికంగా ముగింపు పలికి.. వేడుక నిర్వహించారు. ఆ ఫైటింగ్ దృశ్యాలను కొంతమంది సెల్‌ఫోన్‌లో బంధించారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో కూడా ఇలాంటి గొడవలు చాలానే జరిగాయి. వైకాసి బ్రహ్మోత్సవాల్లో గత రాత్రి జరిగిన హనుమంతు వాహనసేవ సమయంలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన దోసె, వడ పంచుకునే విషయంలో ఉత్తరాది, దక్షిణాది వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Also Read :Telangana: ఏండ్లు గడిచినా.. ఆ భూములకు పత్తాలేని పాస్ బుక్ లు!
శ్రీవైష్ణవులకు చెందిన 108 దివ్య దేశాల్లో ఒకటి కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం. ప్రపంచంలోనే అతిపురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సవరం కనుమ పండుగ రోజు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరే వరదరాజ పెరుమాళ్ ఉత్సవమూర్తి.. పళశివరం గ్రామంలోని కొండపైకి చేరుకుంటారు. ఈ పార్వేట ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో శ్రీవైష్ణవ సంప్రదాయ భక్తులు విచ్చేస్తుంటారు. ఊరేగింపు సమయంలో స్వామి వారికి అర్చక స్వాములు దివ్య ప్రబంధాలు పాడతారు. అయితే.. ఈసారి కనుమ రోజు నిర్వహించిన పార్వేట ఉత్సవంలో అర్చక స్వాముల మధ్య ఘర్షణకు దారితీసింది.