రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్...ఆయన మేనల్లుడు ఖచరియావాస్. మంత్రి మేనల్లుడికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. రాష్ట్ర మంత్రి ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ మేనల్లుడు మద్యం మత్తులో ఓ హోటల్‌ను ధ్వంసం చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. మొదట హోటల్ సిబ్బందితో ఏదో విషయంపై వాగ్వాదానికి దిగినట్లు, ఆ తర్వాత అకస్మాత్తుగా సహనం కోల్పోయి ఎదురుగా కౌంటర్ లో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. పోలీసులు అక్కడికక్కడే ఉన్నా అతన్ని మాత్రం అడ్డుకోలేదు.
మంత్రి ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ మేనల్లుడు హర్షదీప్ ఖాచరియావాస్ మద్యం మత్తులో 5-6 మందితో హోటల్‌లో కొంతమందితో వాగ్వాదానికి పాల్పడ్డాడు. అక్కడ హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి హోటల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ వీడియోలు బయటకు రావడంతో...మంత్రి మేనల్లుడు మరింతగా రెచ్చిపోయాడు. కెమెరా రికార్డింగ్స్ డిలీట్ చేయమంటూ ఒత్తిడి తీసుకువచ్చారని హోటల్ యజమాని తెలిపాడు. ఆ వీడియోలు ఎలా బయటకు వచ్చాయంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ వాపోయాడు. ఫోన్ కాల్స్ చేస్తూ మాపై రకరకాలుగా వేధిస్తూ..ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు.
ఈ విషయంపై బాధితుల ఫిర్యాదుతో జైపూర్‌లోని వైశాలి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ శివ నారాయణ్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడతామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, వైరల్‌గా మారిన వీడియోలో, హర్షదీప్ ఖాచరియావాస్ తాగి హోటల్‌లో ఏదో గొడవ పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.