ఎవరైనా డబ్బులు దొరకగానే ఏం చేస్తారు. రయ్‌మంటూ పోలీసులకు దొరకకుండా ఎటైనా చెక్కేస్తారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. జేబులో లక్షల కొద్ది కొట్టేసిన సొమ్ము ఉన్నప్పటికీ ఫ్రీగా కూల్ డ్రింక్ ఇస్తున్నారన్న ఆశతో వచ్చి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. లూథియానాలో CMS ఇన్ఫో సిస్టమ్స్ లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందన్న సంగతి తెలుసుకున్న దంపతులు జస్వీందర్ సింగ్, అతని భార్య మనదీప్ కౌర్ పక్కాగా ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం డబ్బులూ కొట్టేశారు . ఇక్కడి వరకూ కథ బానే నడిచింది. పోలీసులు కూడా వీరిని పట్టుకోడంలో విఫలమయ్యామని బాధపడ్డారు. ఇంతలో మన్ దీప్ కౌర్ అనుచరుడు గౌరవ్ పోలీసులకు దొరికి పోయాడు.
మహత్తర ఆలోచన, దొంగల పట్టివేత
పోలీసుల విచారణలో గౌరవ్ మనదీప్ దంపతులు పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటూ వారు నేపాల్ వైపు వెళ్తున్నారని సమాచారమిచ్చాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై హేమ్ కుండ్ సాహెబ్ వద్ద నిఘా పెట్టారు. కొన్ని వేల మంది భక్తులు అక్కడి వస్తుంటారు. దీంతో ఇంతమంది జనంలో దొంగలను ఎలా గుర్తు పట్టాలా అని పోలీసులు మల్లగుల్లాలు పడ్డారు. చివరికి ఒక మహత్తర ఆలోచన వారికి వచ్చింది. హేమ్ కుండ్ కు వచ్చే ప్రధాన మార్గంలో ఫ్రీ కూల్ డ్రింక్ భక్తుల కోసం అంటూ పెద్ద బ్యానర్ పెట్టారు. కూల్ డ్రింక్ ఉచితం ... అని పెట్టగానే జనం తండోపతండాలు గా రాసాగారు. ఇక మన గజదొంగలు కూడా ఈ ఉచిత కూల్ డ్రింక్ బుట్టలో పడిపోయారు. వీరిద్దరూ కూల్ డ్రింక్ తాగడానికి వచ్చి తమ మొహాల మీద ముసుగు తీయగానే పోలీసులు వారిని గుర్తించారు.
6 కోట్ల వరకూ రికవరీ, "క్యాచ్ క్వీన్ బీ "నామకరణం
కానీ వెంటనే అరెస్ట్ చేయకుండా వారిని గుడిలోకి వెళ్లి ప్రార్ధన చేయనిచ్చి మరీ అరెస్ట్ చేశారు. ఈ 8.5 కోట్ల దోపిడీ లో పోలీసులు ఇప్పటి వరకూ 6 కోట్ల రూపాయిల వరకూ రికవరీ చేసినట్టు సమాచారం. అయితే కూల్ డ్రింక్ తాగే సమయంలో దోపీడి దారులు మన్ దీప్ , జస్వంత్ వద్ద 12 లక్షలు, 9 లక్షల వరకూ నగదు ఉండటం ఇక్కడ కొసమెరుపు. ఈ ఆపరేషన్ కు పోలీసులు పెట్టిన పేరు "క్యాచ్ క్వీన్ బీ ". మొత్తానికి ఆ క్వీన్ బీ ని పట్టేశారు పోలీసులు.