Greater Voters: హైదరాబాద్ ఓటరు ఎందుకు గమ్మున ఉన్నాడు? ఓటు వేయడానికి మొహం చాటేశాడెందుకు? పోలింగ్ చల్లబడటానికి కారణం ఏమిటి? ప్రశ్నలు చాలానే ఉన్నాయి. కారణాలు కూడా వాటిని మించి ఉన్నాయి. కర్ణుడి చావుకి కారణాల లిస్ట్ అంత పెద్దది గ్రేటర్ లో ఓటరు చప్పుడు చేయకుండా ఉండటానికి. మచ్చుకు కొన్నిటిని చెప్పుకుందాం..
ఓట్ల గల్లంతు..
ఎందుకు జరిగిందో.. ఎలా జరిగిందో దానిమీద పోస్ట్ మార్టం అవసరం లేదు కానీ భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్, గ్రేటర్, పట్టభద్రుల ఎంఎల్సీ అన్నిటికీ ఓటు వేసిన వారికి కూడా ఈసారి ఓటు దక్కలేదు. ఓటరు కార్డు చేతిలో ఉన్నా.. ఓటు లేకపోవడం చాలా పోలింగ్ స్టేషన్ల వద్ద కనిపించింది. వారు మా ఓటు ఏమైందని వాపోవటం కనిపించింది.
సెలవులకు చెక్కేయడం..
అవును ఈరోజు గురువారం.. రేపు శుక్రవారం.. తరువాత శని ఆది వారాలు. వారాంతపు సెల్లవులు రెండిటికి ఒకరోజు ముందు ఎన్నికల పండగ సెలవు వచ్చింది. ఇంకేముంది.. శుక్రవారం సెలవు పెట్టేసి చాలామంది తమ తమ సొంత ఊళ్లకు చెక్కేశారు. హైదరాబాద్ బలం అంతా బయట నుంచి వచ్చి సెటిల్ అయినా సిటిజన్స్ అని మరోసారి రుజువు అయింది. పోలింగ్ బూత్ లు ఖాళీగా మిగిలిపోయాయి.
ఇంటింటి ప్రచారం ఎక్కడ?
ఈసారి ఎన్నికల్లో ప్రచార కోలాహలం హైదరాబాద్ లో చాలా తక్కువ అని చెప్పాలి. ఇదివరకులా ఇంటింటికీ అభ్యర్థులు తిరిగి ప్రచారం చేయడం చాలా చాలా తక్కువగా కనిపించింది. అంతేకాదు. పోలింగ్ కు రెండు మూడు రోజుల ముందు ఓటరు స్లిప్స్ ఇంటింటికీ వెళ్లి అందించేవారు ఆయా పార్టీల అభ్యర్థుల ప్రతినిధులు. కొన్ని బస్తీలు.. కొన్ని ప్రాంతాలలో మినహా చాలా చోట్ల అసలు ఇటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎందుకో ఓటరు ఉదాశీనంగా ఉండడం కంటే.. అభ్యర్థులు ఉదాశీనంగా వ్యవహరించిన తీరు కనిపించింది. అదీకాకుండా సోషల్ మీడియా ప్రచారంపై ఎక్కువ నమ్మకం పార్టీలు పెట్టుకున్నారనేది వాస్తవం. అయితే, సోషల్ మీడియా ప్రచారం ఒకసారి చూసి ఆనందించడానికి బావుంటుంది కానీ.. ఓటు వేసేందుకు ఆసక్తి ని రేకెత్తించడం కష్టం అనే సంగతి పార్టీలు గుర్తించలేదనిపిస్తుంది.
పెద్ద పెద్ద నాయకులు..
ప్రధాని మోడీ దగ్గర నుంచి ప్రియాంక వరకూ పెద్ద నాయకులంతా రాడ్ షోలతో హోరెత్తించారు. అవి ఓటరును పోలింగ్ స్టేషన్ కు నడిపించడానికి సరిపోలేదు. రోడ్ షోలు సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ఓటరును ఓటు వేయాలి అనిపించేలా చేసే సెంటిమెంట్ ఏదీ ఈ నాయకులూ తీసుకురాలేకపోయారని చెప్పవచ్చు. కొంత వరకూ టీఆర్ఎస్ ఆ ప్రయత్నం చేసినా.. అది పాతది కావడంతో గ్రేటర్ ఓటర్ కు కిక్ ఇవ్వలేదనిపిస్తోంది. ఏ పార్టీ దగ్గర కూడా సరైన ప్రచారాస్త్రం లేదు. అందరూ పాత చింతకాయ పచ్చడి లాంటి ప్రసంగాలతో పనికానిచ్చేశారు. ఏ నాయకుని సమావేశం కూడా గ్రేటర్ సమస్యల మీద మాట్లాడింది లేదు.. కనీసం గ్రేటర్ అభివృద్ధిని గురించి ఏమి చేద్దామని అనుకుంటున్నారో చెప్పిందీ లేదు.
Also Read: తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్సే.. తేల్చి చెబుతున్న ఎగ్జిట్ పోల్స్..!
రూరల్ కి అర్బన్ కే కాదు గ్రేటర్ కి కూడా ఓటరు నాడిలో తేడా ఉంటుంది. సాధారణంగా పట్టణ ఓటర్లు అని రాజకీయులు చెప్పే ఓటర్ల కోవలోకి గ్రేటర్ ఓటరు రాడు. ఎందుకంటే, పట్టణ ఓటర్ల ప్రియారిటీలకంటే.. హైదరాబాద్ ఓటర్ల ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి. ట్రాఫిక్.. రోడ్లు.. కాలనీల్లో ఉండే రకరకాల సమస్యలు.. ముఖ్యంగా మంజీరా నీరు వంటి సమస్యల గురించి ఎవరైనా మాట్లాడతారా? అని చూస్తారు. దాని విషయంలో కనీసం అభ్యర్థులు కూడా దృష్టి పెట్టలేదు.
ఇవన్నీ కొన్ని కారణాలు మాత్రమే. ఏదేమైనా.. గ్రేటర్ ఓటరు బద్ధకిస్టు.. మొద్దు నిద్ర పోయాడు అని చాలామంది అనుకున్నా కానీ.. యుద్ధం చేసేటప్పుడు కుంభకర్ణుడి లాంటి వాడి నిద్రనైనా వదల్చాల్సిందే కదా. అదే ఇక్కడ కొరవడింది. ఓటు వేయాలి అనే ఆసక్తిని రేకెత్తించడంలో పార్టీలు.. అభ్యర్థులు.. అధికారులు అందరూ ఫెయిల్ అయ్యారు. వారి ఫెయిల్యూర్ అనే మాట పక్కన పెడితే.. ఓటు వేయకుండా ఉండిపోయిన గ్రేటర్ జనానికి రేపు తమ హక్కుల గురించి ప్రశ్నించే అవకాశం ఉంటుందా? చదువుకున్న వారు కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఓటు హక్కును వినియోగించుకోకపోతే.. భవిష్యత్ లో పరిస్థితి ఎలా ఉంటుంది? అనేది ఇప్పడు వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
చివరగా ఒక మాట.. గ్రేటర్ లో కేవలం 39.9 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే 40 శాతం. ఇంకా చెప్పాలంటే 60 శాతం మంది ఓటు వేయలేదు. ఇప్పుడు వంద మందిలో 40 మంది ఓట్లేస్తే.. అందులో ప్రధాన పార్టీలు మూడింటికీ 30 శాతం ఓట్లు వస్తే.. అంటే ఒక్కొరికీ 10 శాతం ఓట్లు పడితే.. మిగిలిన 10 శాతంలో ఓ రెండు శాతం పనికిరాకుండా పొతే.. మిగిలిన ఎనిమిది శాతంలో ఎవరో ఒక అభ్యర్ధికి రెండు శాతం ఓట్లు ఎక్కువ పడి.. మిగిలిన ఆరు శాతం ఇండిపెండెంట్లకు పొతే.. గెలిచే అభ్యర్ధికి పడే ఓట్లు 12 శాతం అనుకోవచ్చు. అంటే.. కేవలం 12 మంది ఓటర్లు.. ఎన్నుకున్న వాడే ఎమ్మెల్యే.. పోనీ ఇంకా ఎక్కువ తక్కువ అనుకున్నా.. ఎక్కడన్నా గంపగుత్తగా ఓట్లు ఒక్కరికే పడిపోయాయి అనుకుంటే కూడా.. ఓ 20 ఓట్లతో ఎమ్మెల్యేగా గేలిచేసి.. మిగిలిన 80 మంది ఓటర్ల ఐదేళ్ల భవిష్యత్ డిసైడ్ చేసేది అతనే. ఏమండీ గ్రేట్ గ్రేటర్ ఓటరు మహాశయా అర్ధం అవుతుందా?
Watch this interesting Video: