Srisailam: శ్రీశైలంకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఒక్కసారిగా ప్రాజెక్టులోకి వరద పెరిగడంతో ఇవాళ సాయంత్రం 4 గంటలకు గేట్లను ఎత్తనున్నట్లు అధికారులు వెల్లడించారు. దిగువ ప్రాంతాల్లోని అధికారులను ప్రాజెక్ట్ అధికారులు అలర్ట్ చేశారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలంలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. జూరాల ప్రాజెక్ట్ 41 గేట్లను ఎత్తివేశారు. ఒక్క జూరాల నుంచే శ్రీశైలంలోకి 3,01,690 క్యూసెక్కుల వరద చేరుకుంది.
శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం నీటిమట్టం 876.70 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 TMCలు, ప్రస్తుతం నీటి నిల్వ 171.8625 TMCల వద్ద ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌లోకి 63వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.